కామారెడ్డి/ మోర్తాడ్, ఆగస్టు 21: రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా బుధవారం రాస్తారోకో నిర్వహించారు. భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయలేదని విమర్శించారు.రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాసుపుస్తకం ఆధారం గా రైతులందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పార్టీలకు అతీతంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇప్పుడేమో రేషన్‌కార్డు లేదు, పేర్లు తప్పున్నయి అంటూ మాఫీ చేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు.
మూడు విడుతల రుణమాఫీ జాబితాలు ప్రకటిస్తే అందులో కమ్మర్పల్లి మండలంలో కేవలం 30శాతం మందికే మాఫీ వచ్చిందని, మిగతా వాళ్ల పరిస్థితి ఏంటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తహసీల్దార్ ఆంజనేయులు రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా.. రైతులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.