నవీపేట,ఏప్రిల్ 30: కొన్నేండ్లుగా తమ భూములకు పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందక తీవ్రంగా నష్ట పోతున్నామని, భూ భారతి చట్టం ద్వారా నైనా తమ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు ఫత్తేనగర్ గ్రామ రైతులు మొర పెట్టుకున్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో బుధ వారం నిర్వహించిన భూ భారతిపై అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు.
సదస్సుకు ఫత్తేనగర్ గ్రామ రైతులు హాజరై కలెక్టర్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ తాత, ముత్తాతలు మాజీ సైనిక ఉద్యోగులు కావడంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్ల క్రితం ఫత్తేనగర్ శివారులో 1500 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. నాటి నుంచి భూములను సాగుచేసుకుంటూ వచ్చారన్నారు.
అయితే ఈ భూములకు పట్టాలు లేక పోవడంతో బ్యాంకు రుణాలతోపాటు రైతు బంధు, రైతుబీమా తదితర పథకాలు అందక నష్ట పోవాల్సి వస్తుందని వాపోయా రు. భూ భారతి ద్వారా నైనా తమ భూములకు పట్టాలు ఇప్పిం చి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో నవీపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.