వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అకాల వర్షాలు వెంటాడుతున్న వేళ.. కాంటాల్లో జరుగుతున్న తాత్సారం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు పలుచోట్ల నిరసనలకు దిగుతున్నారు. సొసైటీలకు తాళాలు వేసి, సిబ్బంది తీరుపై రుసరుసలాడుతున్నారు. వడగండ్ల ముప్పు పొంచి ఉన్న తరుణంలో కాంటాల్లో జాప్యం చేయడమేమిటని నిలదీస్తున్నారు. కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండెనని, పంట కోయగానే తూకం వేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశారని గుర్తు చేసుకుంటున్నారు.
నస్రుల్లాబాద్/పొతంగల్, ఏప్రిల్ 19: ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తాత్సారంతో ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో చేతికొచ్చిన పంట చేజారిపోతుందన్న భయం అన్నదాతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కడుపు మండిన రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. సొసైటీలకు తాళాలు వేస్తూ ప్రభుత్వ యంత్రాంగ తీరును ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో.. ఆరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. వాటిని మళ్లీ ఆరబెట్టడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితి తమకు రావొద్దని మిగతా కర్షకులు కోరుకుంటున్నా రు. వెంటనే కాంటాల్లో వేగం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని సొసైటీల్లో పక్షపాతం చూపిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కావాల్సిన వారికే సంచులు ఇస్తున్నారని, మిగతా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇటీవల కొత్తపల్లి సొసైటీ ఎదుట లింగాపూర్, గన్నారం గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు. తాజాగా పొతంగల్ ప్రొథమిక సహకార సంఘం ఎదుట అన్నదాతలు శనివారం నిరసనకు దిగారు. సొసైటీ సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదని, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హమాలీల కొరతతో కాంటాలు వేయడం లేదని, గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యల గురించి ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంట కోసి 15 రోజులవుతున్నా కాంటాలు వేయకపోతే ఎలా..? వర్షాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎండిన ధాన్యం తడిసిపోతే ఎవరు బాధ్యులని రైతులు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్
చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వడ్లు అమ్ముకున్నామని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ‘కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండె. ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు. పంట కోసిన వెంటనే కాంటాలు వేసిండ్రు. వెంటవెంటనే డబ్బులు ఖాతాల్లో జమ చేసిండ్రని’ రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ‘రుణమాఫీ ఇయ్యకుండా, రైతుబంధు డబ్బులు వెయ్యకుండా మోసం చేసిండ్రు. ఇప్పుడు వడ్లు కొనుకుండా సతాయిస్తున్నారని’ వాపోతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ బీర్కూర్ మండలం బైరాపూర్ ప్రాథమిక సహకార సంఘానికి మల్లాపూర్ గ్రామ రైతులు శనివారం తాళం వేశారు. వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు, కాంటా వేయడం లేదని నిరసిస్తూ మొన్న ఎత్తొండ సొసైటీకి కూడా రైతులు తాళం వేసి నిరసన చేపట్టారు.