మాక్లూర్, మే 6: ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని మాదాపూర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఆధ్వర్యంలో గ్రామంలోని నందిపేట్-నిజామాబాద్ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. రెండుగంటలపాటు ఎర్రని ఎండ లో బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూకం వేసిన బస్తాలను లారీల కొరత పేరుతో తరలించడంలేదని, రైస్‌మిల్లుల యజమానులతో కుమ్మక్కై కిలోకు తరుగు పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు.
సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా హమాలీలు లేక తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఆర్డీఏ సాయాగౌడ్, ఏఈడీఏ విజయలక్ష్మి, తహసీల్దార్ వచ్చి, రైతులను సమదాయించారు. సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి, రాస్తారోకో విరమింప జేశారు. రాస్తారోకోతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.