ఆర్మూర్‌టౌన్, జనవరి18: కాంగ్రెస్ పార్టీలో దు‘మార’ం రేగింది. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అవినీతికి వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుడే దీక్షకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మార గంగారెడ్డి మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సొసైటీ లెక్కలు చెప్పడం లేదని, అంతులేని అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ అదే గ్రామానికి చెందిన రైతు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినోద్‌రెడ్డి శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి అవినీతికి వ్యతిరేకంగా అదే పార్టీ నేత దీక్ష చేపట్టడం రాజకీయంగా దు‘మారం’ రేపింది.
అంకాపూర్ సొసైటీకి సంబంధించిన లెక్కలను చూపాలని వినోద్‌రెడ్డి కొన్నాళ్లుగా అడుతున్నారు. గోదాం అమ్మిన డబ్బులతో పాటు విరాళంగా వచ్చిన నిధులను ఏం చేశారని పలుమార్లు ప్రశ్నించినా సరైన స్పందన రాలేదు. ఈ క్రమంలోనే వినోద్‌రెడ్డి శనివారం గ్రామంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకాపూర్లోని సొసైటీకి చెందిన గోదాం అమ్మిన డబ్బులు రూ.25 లక్షలు, విరాళంగా వచ్చిన రూ.5 లక్షలకు సంబంధించిన లెక్కలు చూపించడం లేదన్నారు. రూ.30 లక్షలకు సంబంధించిన లెక్కలు చూపించాలని గత నెలలో పీఏసీఎస్ కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.
దీంతో ఆగ్రహానికి గురైన సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీకి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ క్రమంలో వీడీసీ సభ్యులు తనకు జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో గంగారెడ్డి వచ్చే నెలలో లెక్కలు చూపుతామని వీడీసీకి హామీ ఇవ్వడంతో తాను రాజీ పడ్డానని తెలిపారు. నెల రోజులు గడుస్తున్నా లెక్కలు చూపించక పోవడంతో పోరాటం చేయక తప్పడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే రిలే నిరాహార దీక్ష చేపట్టానని వినోద్‌రెడ్డి చెప్పారు. గ్రామం కోసం చేస్తున్న ఆయన ఆందోళనకు పరోక్షంగా మద్దతునిస్తున్న గ్రామస్తులు వీడీసీకి భయపడి ముందుకు రావడం లేదని తెలిసింది.