నిజాంసాగర్ / భీమ్‌గల్, జనవరి 8: ఆ ఊరి రైతులు కూరగాయల సాగుపై దృష్టిసారించి నిత్యం ఆదాయం పొందు తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తూ ఔరా అనిపిస్తున్నారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వెల్గనూర్, బ్రాహ్మణపల్లి, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణ రైతులు. ఆయా గ్రామాల రైతులకు ఉన్న వ్యవసాయ భూముల్లో ఉల్లినారు, పాలకూర, కొత్తిమీర, చిక్కుడు, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, మెంతికూర, క్యారెట్, బీట్రూట్, బొప్పాయి ఇలా పలు రకాల వాటిని పండిస్తున్నారు.
ఉదయాన్నే పొలానికి..
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్, బ్రాహ్మణపల్లిలోని ఒక్కో కుటుంబం ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే పొలానికి చేరుకుంటారు. పండించిన కూరగాయలను రోజూ మార్కెట్లో అమ్మేలా కావాల్సినంత సేకరించి లాభాలు పొందుతున్నారు. ఇలా ప్రతిరోజూ ఉదయాన్నే పొలానికి వెళ్లడం, కూరగాయాలను సేకరించి మార్కెట్లో అమ్మడం, ఏ రోజుకు ఆ రోజు డబ్బులను చేతిలో చూడడం వారికి అలవాటైంది. పది సంవత్సరాల నుంచి ఈ గ్రామ రైతులు ఇదే విధంగా కూరగాయలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయలకు కేరాఫ్ అడ్రస్‌గా వెల్గనూర్, బ్రాహ్మణపల్లి అని పలువురు పేర్కొంటుడడం గమనార్హం.
ప్రతి నెలా రూ.30 వేల వరకు..
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణానికి చెందిన మూత బాలయ్య అనే రైతు తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల్లో వరి, మిగిలిన ఎకరం భూమిలో క్యారెట్, బీట్రూట్, బొప్పాయి, పలు రకాల కూరగాయలను పండిస్తున్నాడు. వీటి సాగుకు సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నాడు. క్రిమిసంహారక మందులను పిచికారీ చేయకుండా పంట పండిస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే పొలానికి వెళ్లి కూరగాయలను తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటాడు. ప్రతి నెలా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాడు.
పదేండ్ల నుంచి పండిస్తున్నాం..
పది సంవత్సరాల నుంచి కూరగాయలను పండిస్తున్నాం. వరితోపాటు వీటిని సాగు చేస్తున్నాం. దీం తో అధిక ఆదాయం వసున్నది. ఎకరంలో పండిస్తున్న కూరగాయలతో ప్రతి నెలా రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాం. నాలుగు ఎకరాలకు రాని లాభం ఒక్క ఎకరంలో పండిస్తున్న కూరగాయలకే వస్తుంది. గతంలో కరెంటు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో నిశ్చింతగా సాగు చేస్తున్నాం.
– మూత బాలయ్య, రైతు, భీమ్‌గల్