లింగంపేట, అక్టోబర్ 3: షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మహాధర్నాకు దిగారు. లింగంపేట మండలంలో గురువారం ఆందోళన చేపట్టారు. అన్నదాతలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి.. 303 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. లింగంపేట మండలంలో 3,972 మంది రైతులకు రూ.20 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, 1400 మందికి మాత్రమే మాఫీ చేసి మిగిలిన వారికి ఎగ్గొట్టారన్నారు. ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసినట్లు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు వలసలు పెరిగాయని, గ్రామాల నుంచి వెళ్లిన ప్రజలు మూసి పరీవాహక ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకున్నారన్నారు. ఆ రోజు కండ్లు మూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. మూసి సుందరీకరణ పేరుతో రూ.1.50 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. ఇందులోంచి కోట్లాది రూపాయలను ఢిల్లీకి పంపేందుకు కుట్ర పన్నారన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సద్దులు, సంచులు మోయడానికే వెళ్తున్నారు తప్పితే, ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వచ్చే నేతలను నిలదీయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన రైతులు తహసీల్దార్ నరేందర్‌గౌడ్‌కు వినతి పత్రం అందించారు. నేతలు సంపత్‌గౌడ్, రమేశ్, కపిల్‌రెడ్డి, సాయిలు, గాండ్ల నర్సింలు, శ్రీనివాస్‌రెడ్డి, గన్నునాయక్ పాల్గొన్నారు.