వేసవికి ముందే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గ్రామాల్లో రోజరోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంట పొలాలకు సాగునీరందక ఎండుముఖం పడుతుండడం తో రైతన్నలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కరోజుకు రూ.800 చెల్లించి ట్యాంకర్ ద్వారా పంట పొలాలకు నీళ్లను అందిస్తున్నామని రైతులు గంగాధర్, గంగారెడ్డి, శ్రీనివాస్ తెలిపారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
బోధన్ రూరల్, ఫిబ్రవరి 28: నిజాంసాగర్ కెనాల్ నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందించాలని డిమాండ్ చేస్తూ సాలూర మండలంలోని సాలూర క్యాంప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నీటి పారుదలశాఖ అధికారులను రైతులు నిర్బంధించారు. అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంసాగర్ కెనాల్ డి-28 కింది చివరి ఆయకట్టుకు నీటిని అందించి పంటలను కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాంసాగర్ కెనాల్ నీటి విడుదల చేసి ఏడు రోజులవుతున్నా కింది ఆయకట్టుకు నీళ్లు అందడంలేదని వాపోయారు. ఇంకా రెండు, మూడు రోజుల్లో కెనాల్ నుంచి నీటి విడుదల నిలిచిపోతుందని, అప్పుడు ఏం చేయాలని అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై మశ్చేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు. అధికారులు , రైతులు కలిసి డి- 28 ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు.
రుద్రూర్, ఫిబ్రవరి 28: సాలూర క్యాం ప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నీటి పారుదలశాఖ అధికారుల నిర్బంధంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇరిగేషన్ ఎస్ఈ బద్రినారాయణ, కామారెడ్డి ఎస్ఈ రాజశేఖర్ కలిసి నిజాంసాగర్ కెనాల్‌ను పరిశీలించారు. వర్ని మండలంలోని నిజాంసాగర్ డీ-20 కాలువను పరిశీలించి కింది స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. అక్రమ నీటి వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు. కాలువ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. మరో ఐదు రోజులు కాలువ నీళ్లు వచ్చే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈ భూమన్న, బల్రాం ఉన్నారు.
నిజాంసాగర్ నీళ్లు చివరి ఆయకట్టు పరిధిలోని మా పంటలకు అందడం లేదు. నీటి పారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ఇచ్చిన కూడా కూడా కాలువలో సగం కూడా రావడంలేదు.ఇలాగే కొనసాగితే మా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు నీటిని అందేలా చూడాలి.
-పాలెటి శ్యాంబాబు, రైతు, సాలూర క్యాంప్
నిజాంసాగర్ కెనాల్ నీటి వదలి వారం రోజులువున్నది. డి -28 కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందలేదు. బోర్లు ఎత్తిపోయినాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రేపు మారో నిజాంసాగర్ మెన్ కెనాల్ బంద్ అయితది. ఎండాకాలం పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి చివరి ఆయకట్టు వరకు నీటి అందేలాచూడాలి.
-విజయ్ భాస్కర్‌రెడ్డి , రైతు, సాలూర క్యాంప్