భిక్కనూరు/ లింగంపేట, డిసెంబర్ 24: యాసంగి పంటల సాగు ప్రారంభం అయ్యిం ది. గ్రామాల్లోని బోరుబావులు, చెరువుల కిం ద వరి నాట్లు వేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు యూరియా ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు యూరి యా వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుంటున్నారు. యూరియా కోసం చెప్పులు, పట్టాదారు పాసు బుక్కులు క్యూ లైన్లో పెడుతున్నారు. అయినా తమకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భిక్కనూరు మండలంలోని కాచాపూర్ సొసైటీ గోదాముకు బుధవారం 444 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చెప్పులను క్యూలో పెట్టి పడిగాపులు గాచారు.
సొసైటీ తెరిచిన అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేసినట్లు సొసైటీ సీఈవో మహేశ్వరి తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెస్సేజ్‌లు చూసి రైతులు ఆందోళన చెందవద్దని, రైతులు నాట్లు వేస్తున్నందున యూరి యా సరఫరా చేస్తామని చెప్పారు. లింగంపేట సహకార సంఘం పరిధిలో యూరియా అందుబాటులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న రైతులు ఉదయం 8 గంటలకే లింగంపేటలోని సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. తమ ఎరువుల పుస్తకాన్ని వరుసలో పెట్టి వేచి చూశారు. సుమారు తొమ్మిది వందల బస్తాల యూరియాను సొసైటీ అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియాను సరఫరా చేశారు. పంటల సాగు ప్రారంభంలోనే యూరియా కష్టాలు ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.