కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట కరెంటు ఇస్తుండే. బోర్లకాడ పండుకునే పరిస్థితి ఉండే. గత తొమ్మిదేండ్లుగా ఆ కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ నిరంతర కరెంటు ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు వచ్చి కొత్తగా మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్తుండ్రు. అట్లనే 10హెచ్‌పీ మోటర్లు వాడాలని ఉచిత సలహా ఇస్తుండ్రు. వాళ్లకు ఏమైనా బుద్ధిందా.. అట్లాంటి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చే ప్రసక్తే లేదు.
అనుచిత వ్యాఖ్యలపై రైతాంగం మండిపడుతున్నది. మూడు గంటల కరెంట్ ఇస్తే పంటలు ఎండుడు ఖాయం.. తాము మునుగుడు ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, ధరణి ఎత్తేస్తామన్న కాంగ్రెస్‌ను ఎన్నికల్లో మట్టి కరిపిస్తామని అన్నదాతలు స్పష్టంగా చెబుతున్నారు. ‘కేసీఆర్ సారు సీఎం అయినంకనే రైతు బతుకు బాగువడ్డది. కాంగ్రెసోళ్లు ఇప్పుడు వచ్చి మళ్లీ మమ్మల్ని ఆగం జెయ్యనీకి సూత్తుండ్రు. మూడు గంటల కరెంట్‌తోని ఎవుసం ఎట్ల నడుత్తది. ఉన్న మోటర్లు పీకి పది ఎస్పర్ల మోటర్లు పెట్టుమన్నోడికి తలకాయ ఉన్నదా..? ధరణితోని రైతులకు ఎంత సౌలత్గా ఉన్నది. నిమిషాలల్ల రిజిస్ట్రేషన్లు అయిపోతున్నయ్. గంత సౌలత్ ఉన్న ధరణిని ఎత్తెత్తమని చెప్పేటోనికి ఎంత ధైర్యం’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘ఎవడన్న రైతులకు మంచి చేస్తామని చెప్పి ఓట్లడుగుతారు.. కాంగ్రెసోళ్లేమో మిమ్మల్ని ముంచుతామని ఓట్లు అడుగుతున్నారు. యాభై ఏండ్ల పాలనల మేం పడ్డ కష్టాలు యాది మరువలె. పొలం కాడ జాగారం జేసిన దినాలూ మరిసిపోలె. కాంగ్రెసోళ్లను ఇంకా నమ్మేదే లేదు. ఓటేసేది అంతకన్నా లేదు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కేసీఆర్ సారేకే మా ఓటు అని’ అన్నదాతలు కుండబద్ధలు కొడుతున్నారు.
ఒడ్డు మీద ఉన్నోడికి ఏం తెలుసు.. పొలంలోకి దిగి, పంట పండిస్తే తెలుస్తది ఎవుసం గురించి. ఏసీ రూముల్లో కూర్చున్నోడు మూడు గంటల కరెంటు ఇస్తే పొలం పారుతుందంట.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాల్నని చెప్తడు.. గీ కాంగ్రెసోళ్లు కథలు చెప్పుట్ల నంబర్ వన్.. గీళ్ల గురించి మమ్మల్నే అడగాలె. దొంగరాత్రి కరెంటు ఇచ్చి రైతులను పొలాలపొంటి తిప్పిందెవరు.. పురుగు,బుసి కుట్టి అన్నదాత చచ్చేలా చేసిందెవరో మాకు తెల్వంది కాదు. కరెంటు లేక కండ్లముందు పంట ఎండుతుంటే తట్టుకోలేక రైతులు వేలాడిన ఉరికొయ్యలె చెప్తయ్. గా దేవుడే కేసీఆర్ రూపంలో వచ్చి మా రైతులను ఒక తొవ్వలోకి తెస్తే.. ఇప్పుడు కాంగ్రెసోళ్లు మళ్లొచ్చి మా నోట్లో మన్ను కొట్టాలని చూస్తున్నారని రైతులు అభిప్రాయపడుతున్నారు. అసలు వీరికి మళ్లీ అధికారం కట్టబెట్టేంత సాహసం చేయబోమని స్పష్టం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ బాధలు చాలా ఉండేవి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెల్వదు. ఎప్పుడు పోతుందో తెల్వదు. పంటలకు నీళ్లు పెట్టేందుకు పొలం కాడ జాగారం చేస్తుంటిమి. ఆ రాత్రి పాములు, తేళ్లతో ఇబ్బందిపడేవాళ్లం. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే చాలా భయమేస్తుంది. కరెంట్ లోడ్ ఎక్కువై వారంలో మూడు, నాలుగుసార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు 24గంటల కరెంటు ఇస్తున్నారు. నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. మళ్లీ ఆ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పొలంకాడ జాగారం చేయాల్సి వస్తుంది.
రైతులకు 3 గంటల కరెంట్ దేనికీ సరిపోదు. ఏ అవగాహనతో కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతుందో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో రైతు నిబ్బరంగా పొలాలకు నీరు పారిచుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు.. కరెంటు షాక్‌లు తప్పేలా లేవు. ఏ రైతుకు కూడా 10హెచ్‌పీ మోటరు అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రతి రైతు 3నుంచి 5 హెచ్‌పీ మోటర్ల వరకే వాడుతున్నారు. కాంగ్రెస్ 10హెచ్‌పీ మోటర్లను తెరపైకి తేవడం వారి అవివేకానికి నిదర్శనం. కాంగ్రెస్ డోకాబాజ్ మాటలు రైతులు నమ్మేస్థితిలో లేరు.
రైతులకు కరెంటు కష్టాలు తీర్చింది సీఎం కేసీఆరే. సాగుకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నడు. ఇప్పుడు భూములన్నీ పచ్చబడ్డాయి. కాంగ్రెసోళ్లు పంటల సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతుండ్రు. వాళ్లొస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయి. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చేది. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటుతో పంటలు పండించలేం. వాళ్లను నమ్మడానికి మేం తిక్కోళ్లమేం కాదు. మా బతుకులు బాగుచేసే వ్యక్తి కేసీఆరే. కాంగ్రెస్ మాటలు పచ్చి అబద్ధాలు. వాళ్ల మాటలు నమ్మి మోసపోం.
డిచ్పల్లి, నవంబర్ 21: రైతులకు మూడు గంటల కరెంట్ చాలని, 24గంటల విద్యుత్ అవసరం లేదని కాంగ్రెసోళ్లు మాట్లాడడం చూస్తే వారికి ఎవుసంపై ఎలాంటి అవగాహన లేదని తెలుస్తున్నది. 10హార్స్పవర్ మోటర్లు బోర్లకు ఎవరైనా వాడుతారా? బోర్ల నుంచి ఊరే నీరు 5హెచ్‌పీ మోటర్లకే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎందుకు 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటారు. కాలువలు, చెరువుల నుంచి నీటిని తోడడానికే 10హెచ్‌పీ మోటర్లు వాడుతారు. ఆ మోటరు ధర కూడా ఎక్కువే. పైర్ల సాగుకు 5హెచ్‌పీ మోటర్లే సరిపోతున్నప్పుడు ఇబ్బందులు తెచ్చే 10హెచ్‌పీ మోటర్లు ఎందుకు వాడాలి? కాంగ్రెసోళ్ల మాటలు రైతులను మోసం చేసేలా ఉన్నాయి. వారి మాటల్ని రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా తడవదు. నేను ఐదెకరాల భూమి సాగు చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇస్తుండడంతో మోటర్ల ద్వారా పంటలు బాగా పండిస్తున్నా. కాంగ్రెసోళ్ల మాటలతో మళ్లీ పాతరోజులే వస్తాయనే భయంపుడుతుంది. అప్పట్లో రాత్రిపూట కరెంట్‌తో పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ కష్టాలు అనుభవించాం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరెంట్ కష్టాలు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నాం. కరెంట్ కష్టాలు తెచ్చే పార్టీలను మేం నమ్మం. తెలంగాణ రాకముందు ఆ పార్టీలతో పడ్డ కష్టాలు చాలు. మూడు గంటలు వద్దు.. 24 గంటలే ముద్దు.
కాంగ్రెసోళ్లు కరెంట్ సక్కగిస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టేవాడే కాదు. ఆ పార్టీ వాళ్లు ఆడింది ఆట, పాడింది పాటలాగా పాలన చేసిండ్రు. వాళ్లకు ముక్కుతాడు వేసింది ఎన్టీఆర్. ఆ తర్వాత మన కేసీఆర్ సారే. యాభై ఏండ్ల పాలనలో చేయనోళ్లు ఇప్పుడు చేస్తామని చెబుతున్నారు. ప్రజలు వాళ్ల మాటలు నమ్మడం లేదు. ముఖ్యంగా రైతులు కేసీఆర్ సార్ నాయకత్వాన్నే నమ్ముతారు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. గాడ సక్కగా కరెంట్ ఇవ్వనోళ్లు.. తెలంగాణలో గెలిస్తే ఇస్తామని చెబితే ఎవ్వడూ నమ్మడు. రైతులకు నీళ్లు, కరెంట్, పెట్టుబడికి సాయం కేసీఆర్ సారే ఇచ్చిండు. అన్నం పెట్టినోడిని విడిచి పెట్టి సున్నం పెట్టేవాడి మాటలు నమ్మం.
మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు సరిపోదు. ఆ మూడు గంటలు ఏ సమయంలో ఇస్తారో కూడా తెల్వదు. గతంలో రాత్రుళ్లు పొలం దగ్గర్నే పడుకునేవాళ్లం. కరెంట్ కోసం ఎదురుచూసేవాళ్లం. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చు కాంగ్రెస్ భరిస్తదా? 10హెచ్‌పీ మోటరు పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. భూమి లోపల ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. పంటలు ఎండిపోతాయి. నష్టాల పాలవుతాం. ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో 24గంటల కరెంటుతో రెండు పంటలు పండించుకుంటున్నాం. మూడు గంటల కరెంటుతో పంటలు ఎలా పండుతాయో కాంగ్రెస్ వాళ్లకే తెలియాలి.
కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటిస్తే పంటలు పండించేందుకు సరిపోదు. నాకున్న భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తాను. ఒక్కో పంటకు ఒక్కోసారి నీళ్లు పారిస్తా. పొద్దున్న ఇస్తరో, రాత్రి ఇస్తరో కాంగ్రెసోళ్లు చెప్పరు. మూడు గంటల కరెంటిస్తే రైతులు ఒకేసారి మోటర్లు స్టార్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. వాటిని రిపేర్ చేయడానికి సమయం, డబ్బు వృథా. అంతలోపు పంటలు ఎండిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కరెంట్ సరిగ్గా ఇయ్యక పంటలు ఎండిపోయేవి. ఆరుంగాలం పంటలు సాగు చేసినా చేతికొచ్చే వేళ పంటలు ఎండిపోయి.. చేతికి అందక నష్టపోయాం. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24గంటల కరెంట్‌తో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మోటర్లను ఆన్ చేసి నీళ్లు పారిస్తున్నాం. పంటలు బాగా పండుతున్నాయి. 30ఏండ్లుగా ఎవుసం చేస్తున్నా. కానీ ఈ పదేండ్లలో కరెంట్ కష్టాలను చూసి ఎరగలే. మూడు గంటల కరెంటిచ్చి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది.
ధరణి రావడంతో రైతులకు పట్టిన దరిద్రం పోయింది. ఈ పోర్టల్‌తో మాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. దళారీ వ్యవస్థ కనిపిస్తలేదు. గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారి పేర్ల మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ధరణితో స్లాట్‌బుక్ చేసుకున్న 24గంటల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. గతంలో తిరిగితిరిగి అలసిపోయేవాళ్లం. ధరణితో ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికావు. ధరణితో రైతుల భూమిని మ్యాప్ ద్వారా క్లియర్‌గా చూసుకోవచ్చు. పాత, కొత్త పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ రైతులకు ఉపయోగపడవా ? ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని రేవంత్‌రెడ్డి అంటడు. ఆయనకు ఇంతనైనా సిగ్గు ఉండాలి. రైతులు ఈ తొమ్మిదేండ్లలో ఎంత అభివృద్ధి చెందారో ఆయనకు తెలియదా? ధరణి ఉంటే దోచుకోవడానికి వీలు కాదని బంగాళాఖాతంలో పడేస్తవా? రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తూ మీలాంటి లీడర్లకు లంచాలు ఇస్తుంటే బాగుంటది కదా ? రైతుల బాగోగులు చూసేది కేసీఆర్ ఒక్కడే. అలాంటి నాయకుడికి మళ్లీ అధికారం ఇచ్చి మాకు అండగా పెట్టుకుంటాం.
డిచ్పల్లి, నవంబర్ 21: రైతన్నలు పడుతున్న కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో రైతుగా సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు రైతులకు అందుబాటులో ఉన్న తహసీల్ కార్యాలయాల్లో ధరణి ద్వారా సులువుగా జరుగుతున్నాయి. ఎంతో మంచి ఆలోచనతో తీసుకువచ్చిన ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలగిస్తామనడం దుర్మార్గమైన ఆలోచన. రైతులకు ఇది మేలు చేసే చర్య కాదు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయ ప్రలోభం కోసం చేస్తున్న నాటకమే. ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ పాత కష్టాలు మొదలైనట్లే. రైతాంగానికి తీవ్రమైన నష్టం చేసే కుట్రను రైతులు గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి మూడోసారి కేసీఆర్‌నే సీఎంగా చేస్తాం.
రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్‌ను తీసేసి భూమాతగా మార్చితే రైతులకు ఉల్టా నష్టమే తప్ప ఉపయోగమేమీ లేదు. అయ్యా బాంచన్ అని బతిమిలాడాల్సిన పరిస్థితి వస్తుంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు బ్రేక్ పడుతుంది. భూమి రికార్డులు ఆగమైతాయ్. ధరణితో రైతుల భూమి భద్రంగా ఉన్నది. కొత్త పద్ధతి తెస్తే ఎవరి భూమి ఎక్కడ ఉంటుందో తెల్వదు. కాంగ్రెస్ పాలనలో భూముల రిజిస్ట్రేషన్‌కు పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాళ్లం. ఇప్పుడు 20నిమిషాల్లో ఇంటికి వస్తున్నాం. ధరణితో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి భూమాత పోర్టల్‌ను ప్రవేశపెట్టి పాత పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని మాట్లాడడం బాధాకరం. ధరణి రద్దు చేసి పాత పద్ధతి తీసుకువస్తే రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. పాత కాలం లెక్క పటేండ్ల చుట్టూ తిరిగి వాళ్ల కాళ్లు ఎళ్లు మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులను మళ్లీ బిచ్చగాళ్లను చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. దీనిని రైతులంతా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతాం.
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేసి భూమాత పోర్టల్‌ను ప్రవేశపెడతామనడం చూస్తే కాంగ్రెసోల్లవి సోయితక్క మాటలే. ఎవుసం గురించి వాళ్లకు ఏం తెలుసు. అడ్డగోలు హామీలు ఇచ్చి మళ్లీ అధికారం కోసం పాకులాడుతున్నారు. కొత్తగా భూరికార్డుల్లో కౌలుదారు, అనుభవదారు కాలములను ప్రవేశపెడుతామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం చూస్తే తిరిగి రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోందని అనిసిస్తున్నది. రైతుల కష్టాలు ఎరిగిన నేత సీఎం కేసీఆర్ ఎంతో మంచి ఆలోచనతో ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తే, రైతులను మళ్లీ కష్టాల పాలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెప్పడం సబబు కాదు. ఇప్పుడు మీ సేవ కేంద్రాలకు పోతే ఆన్లైన్లోనే అంతా అయిపోతున్నాయి.
తెలంగాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవస్థలో మస్తు ఇబ్బందులు పడ్డాం. అప్పట్లో పహాణీ కావాలంటే పట్వారీ దగ్గరికి వెళ్లి, వారి చెయ్యి తడపనిదే వివరాలు ఇచ్చేవాళ్లు కారు. చాలా మంది భూ రికార్డులు కావాలన్నా? మ్యుటేషన్ చేయించాలన్నా? పట్టా పాస్‌బుక్ కావాలన్నా? తహసీల్ ఆఫీస్ చుట్టూ కూలీ పనులు వదిలిపెట్టి తిరిగేవాళ్లు. ధరణి రాక ముందు పైరవీకారుల చేతుల్లో రైతులు నిలువుగా నష్టపోయారు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణి తీసివేసి కొత్త సాఫ్ట్వేర్ తెచ్చి కౌలుదారు, పట్టాదారు కాలం పెట్టి భూములన్న రైతులను నట్టేట ముంచుతామంటున్నారు. ఇలా చేస్తే భూమి ఉన్న ఏ రైతూ తన భూమిని పడావు అయిన పెట్టుకుంటాడు. కానీ కౌలుకు మాత్రం ఇవ్వడు. ధరణితో ఒక్క దగ్గరనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసి సాయంత్రం వరకు పాస్‌బుక్ చేతికి ఇస్తున్నారు.