బీబీపేట(దోమకొండ), మార్చి 15: పంట వేసి నాలుగు గింజలు పండించి.. ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతున్నది. బోరు బావులను నమ్ముకొని పంటలు సాగుచేయగా.. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో సాగుచేసిన వరికి తడి అందక, పంట పండే పరిస్థితి లేకుండా పోతున్నది. బోర్లు వేసినా.. చుక్క నీరు పడకపోవడంతో రైతులు బోరుమంటున్నారు. పంటపై ఆశలు వదులుకొని, ఆవేదన చెందుతున్నారు. కండ్ల ముందే పంట ఎండిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తున్నది.
దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, గొట్టిముక్కల తదితర గ్రామాల్లో రైతులు వరి సాగుచేశారు. మార్చిలోనే మండుతున్న ఎండలకు భూగర్భ జలమట్టం తగ్గింది. దీంతో బోర్లు సరిగ్గా నీరు పోయడం లేదు. దీంతో వేసిన పంటలో సగం పొలానికైనా నీళ్లు పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో బోరు వేయించినా.. నీరు పడకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దోమకొండకు చెందిన పిప్పిరి బాల్రాజ్ తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేశాడు. పంటను కాపాడుకునేందుకు సుమారు రూ.4.5లక్షలు ఖర్చుచేసి ఒక్కో బోరును 500ఫీట్ల వరకు నాలుగు బోర్లు తవ్వించాడు. మూడు బోర్లలో నీరు పడలేదు. ఒక్కబోరు కూడా సరిగా పోయకపోవడంతో ఎకరం వరకు పంట ఎండిపోయింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు ఎలా వస్తాయని రైతు ఆందోళన చెందుతున్నాడు.
దోమకొండకు చెందిన మరో రైతు బి.ప్రశాంత్ తనకున్న మూడు ఎకరాల్లో వరి వేశాడు. నీటి కోసం రూ.2.50లక్షలు ఖర్చు చేసి మూడు బోర్లు తవ్వించగా.. ఒక్కదాంట్లో మాత్రం నీళ్లు పడ్డాయి. ఆ బోరుకూడా ప్రస్తుతం ఎండలకు సరిగా నీళ్లు పోయడం లేదు. దీంతో ఎకరన్నర వరకు పొలం ఎండిపోయింది. పంట సాగుకోసం ఇప్పటికే రూ.50వేల వరకు ఖర్చు అయ్యిందని రైతు తెలిపాడు. ఉన్న ఎకరన్నర పొలం కాపాడుకునేందుకు రాత్రి కరెంటు కావడంతో పొలం వద్దనే పడుకుంటున్నట్లు తెలిపాడు. ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.