ముగ్గురికి గాయాలు
కిటికీ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ
ముప్కాల్, మే 30 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రెంజర్ల గ్రామంలో కొన్ని రోజులుగా తాళ్ల రాజశేఖర్, మొంచు చిన్న లింబాద్రి అలియాస్ గోపాల్ ఇండ్ల మధ్య గల కిటికీ విషయమై తరచూ గొడవలు తలెత్తుతున్నాయి.
ఆదివారం రాత్రి మొంచు చిన్న లింబాద్రి, మొంచు పెద్ద లింబాద్రి తమ ఇంటి సందులో నుంచి వెళ్తుండగా రెండు కుటుంబాల మధ్య మళ్లీ గొడవ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన తాళ్ల రాజశేఖర్ తన బంధులైన తాళ్ల రాధేశ్యాం, సన్నీరాజ్ కలిసి మొంచు పెద్ద లింబాద్రి, చిన్న లింబాద్రిపై కత్తితో దాడి చేశారు. దాడిలో పెద్ద లింబాద్రి చాతి, చిన్న లింబాద్రి వీపుపై గాయాలయ్యాయి. వారిని అడ్డుకోవడానికి యత్నించిన చిన్న లింబాద్రి భార్య లక్ష్మికి సైతం చేతికి గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం పెర్కిట్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. మొంచు పెద్ద లింబాద్రి కొడుకు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
కత్తిపోట్లకు రాజకీయ రంగును పులుముతున్నారు
కొన్ని రోజులుగా ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కానీ కత్తిపోట్లకు రాజకీయ రంగు పులిమి ఆవేశపూరిత వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని సర్పంచ్ ఆకుల రాజారెడ్డి విమర్శించారు.
రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. బీజేపీ బాల్కొండ ఇన్చార్జి మల్లికార్జున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధికోసం నోటకి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.