వినాయక్‌నగర్, నవంబర్ 11: ప్రభుత్వం గతం లో తమకు కేటాయించిన స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యు లు న్యాయసేవా అధికార సంస్థను మంగళవారం ఆశ్రయించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌భాస్కర్ రావు ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989 సంవత్సరంలో సారంగాపూర్ గ్రామ శివారులోని సర్వేనంబర్ 58లో 7.20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 130 మంది మాజీ సైనికులకు కేటాయించిందని తెలిపారు. ఇప్పటికీ 35 ఏండ్లు గడిచినా.. ఆ స్థలాన్ని మాత్రం తమకు అప్పగించలేదన్నారు. దీంతో సైనిక సంక్షేమ బోర్డుకు, ప్రధాన మంత్రులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు.
నగరంలోని సైనిక సంక్షేమ కార్యాలయంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను చూసి న్యాయవాది బాలరాజ్ నాయక్‌ను కలిశారు. ఆయన ద్వారా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లతో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ విషయమై ఆయన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌కు నోటీసు పంపించి, వివరణ కోరారు.
మాజీ సైనికులకు కేటాయించిన స్థలం కొండలు, గుట్టలతో ఉన్నదని, చదును చేసి ఇవ్వడానికి వీలు పడదని భూగర్భ, గనుల శాఖ పేర్కొన్నదని ఇన్చార్జి తహసీల్దార్ వినయ్‌సాగర్ వివరణ ఇచ్చారు. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలు ఏడాదిలోపు స్వాధీనం చేసుకోలేదన్నారు. ప్రస్తుతం అది నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. దీంతో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి నగరపాలక సంస్థకు నోటీసులు పంపించి వివరణ తీసుకోనున్నారు. తమకు స్థలం ఇచ్చేవరకూ పోరాడుతామని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తెలిపారు.