ఎల్లారెడ్డి రూరల్, జూన్ 16: రాష్ట్రప్రభుత్వం సోమవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎల్లారెడ్డి మండలం మీసన్పల్లి గ్రామ రైతువేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వెలవెలబోయింది. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడే సమయంలో రైతులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. రాష్ట్రంలోని 1031 రైతు వేదికలకు కొత్తగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తూ, ప్రతి మంగళవారం 10 నుంచి 12 గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో లైవ్ ప్రోగ్రాం నిర్వహించడానికి సిద్ధం చేశారు.
రైతునేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న మండలంలోని మీసన్పల్లి రైతువేదికలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో రైతువేదికలో ముగ్గురు అధికారులు, ముగ్గురు రైతులు మాత్రమే ఉండగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. రైతులు లేకుండా చేపట్టిన కార్యక్రమం అభాసుపాలైనట్లు పలువురు మాట్లాడుకోవడం వినిపించింది.