కామారెడ్డి రూరల్, మే 28: కామారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఎన్నికను ఈ నెల 31న నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆ రోజు బల్దియా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న నిట్టు జాహ్నవిని ఇటీవల అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దించేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఇందుప్రియను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. దీంతో వైస్ చైర్పర్సన్ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నెల 31న బల్దియా సమావేశం ఏర్పాటు చేయాలని ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు వీలు కాని పక్షంలో మరుసటి రోజు సమావేశం నిర్వహించి ఎన్నిక చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నది.