ఎడపల్లి, జనవరి 1: మండల కేంద్రంలో రద్దు చేసిన రైల్వే స్టేషన్‌ను పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ రైల్వేలైన్ పునరుద్ధరణ పేరుతో 2019లో రైల్వేశాఖ బోధన్- నిజామాబాద్ రైళ్లను రద్దు చేసిందన్నారు. అనంతరం ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కాలంలో బోధన్ నుంచి మహబూబ్‌నగర్‌కు రైలును ప్రారంభించారని, త్వరలో కరీంనగర్ డెమో రైలును కూడా బోధన్ వరకు పొడగించేందుకు రైల్వేశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు.
రైళ్లు ప్రారంభమైనా రైల్వేస్టేషన్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. నిజాం కాలం నుంచి ఎడపల్లి రైల్వేస్టేషన్ కొనసాగిందని ఆయన అన్నారు. ఈ స్టేషన్‌ను వివిధ కారణాలు చెబుతూ రైల్వేశాఖ అధికారులు మూసివేయడం శోచనీయమన్నారు. ఎడపల్లి రైల్వేస్టేషన్ పునరుద్ధ్దరణ విషయంలో కార్యాచరణ చేపట్టి పార్టీలకు అతీతంగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రైల్వే అధికారులు, ఎంపీ అరవింద్ స్పందించాలని గుమ్ముల గంగాధర్ డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు షేక్ నసీర్, శ్రీపతి మల్లేశ్,రవి, రెంజల్ చిన్న పోశెట్టి, సుదర్శన్, సిద్ద పోశెట్టి, గంగన్న, తరుణ్, సాయిలు ఉన్నారు.