నిజామాబాద్, మే 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నుడా(నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) తరహాలోనే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కుడాను దాదాపుగా కామారెడ్డి జిల్లా అంతటికీ విస్తరించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో “కుడా” వ్యాప్తి చెందగా పాలకవర్గం ఊసు పత్తా లేకుండా పోయింది. నెలలు గడుస్తున్నప్పటికీ చడీచప్పుడు కరువైంది. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ సిబ్బంది నియాకమం, పాలకవర్గం ఏర్పాటు ప్రతిపాదనలు షురూ కాలేదు. పేరుకు అర్బన్ అడెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైనట్లుగా చెబుతున్నప్పటికీ ఊసులో లేని వ్యవహారంపై కింది స్థాయి లీడర్లు కన్నెర్ర చేస్తున్నారు.
కుడా పేరుతో పదవులు భర్తీ చేస్తే తమకే ముప్పు అనే ఆలోచనలో ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓ విధంగా “కుడా” ఏర్పాటు నిర్ణయంతో కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. కోకొల్లలుగా కార్యకర్తలంతా పదవుల కోసం పైరవీలు మొదలు పెట్టడంతో ఎవరి పేరును ప్రతిపాదించాలో? తెలియక అయోమయంలో మునిగి పోతున్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ అవకాశాన్ని చేజార్చుకున్న వారంతా కుడా పాలకవర్గంలో దక్కించుకోవాలని ఆశ పడుతున్నారు. నేతల వ్యవహారం మూలంగా అడుగు ముందుకు పడకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
కామారెడ్డి పట్టణం సరిగ్గా హైదరాబాద్కు 100 కిలో మీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారి 44పై వ్యూహాత్మకంగా మారింది. ఇది వ్యవసాయ ఉత్పత్తులైన చక్కెర, బియ్యం, పప్పు దినుసులు వంటి వాటితో పాటు రియల్ ఎస్టేట్లో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ఈ అభివృద్ధిని క్రమబద్ధీకరించడానికి, పట్టణ సౌకర్యాలను మెరుగు పర్చడానికి “కుడా” ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన చర్యనే. “కుడా” ప్రధాన లక్ష్యం పట్టణ ప్రణాళిక, గృహ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ఇతర మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే. పాలకవర్గం నియామకం లేకపోవడం వల్ల అథారిటీ యొక్క కార్యకలాపాలు ప్రారంభం కాకుండా ఉన్నాయి. ఈ జాప్యం పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల మధ్య అసంతృప్తిని కూడా పెంచుతోంది. కింది స్థాయి లీడర్లకు పదవులు అప్పగిస్తే కొత్త నాయకత్వాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది. తద్వార జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో కొనసాగుతున్న వారికి పోటీ ఏర్పడుతుంది.
ఊహించని పోటీని నిలువరించేందుకు పదవుల భర్తీని చేపట్టడం లేదని హస్తం నేతలే గుసగుసలాడుతున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ప్రతిపాదించిన వారికే డైరెక్టర్ పోస్టులు, ఒకరు ఛైర్మన్ అయ్యే వీలుంది. జిల్లా అంతటా విస్తరించిన కుడాలో పదవి దక్కించుకుంటే పరోక్షంగా ముఖ్య నేతలను డామినేట్ చేస్తారనే భయం కూడా వెంటాడుతోంది. ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ వేగంగా ముందుకు కదలకుండా పక్కకు జరిపినట్లుగా సమాచారం. కుడా ఛైర్మన్ పోస్టుకు ముఖ్య నేతల వారసుల పేర్లు ప్రతిపాదనకు తేవడంపై సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం కూడా కారణమని చర్చ నడుస్తోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కుడా పదవుల భర్తీ వ్యవహారం ఓ విధంగా చిచ్చు రేపుతోంది. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుండటంపై కింది స్థాయి క్యాడర్ అగ్గిమీది గుగ్గిలం అవుతున్నారు. పదవులు మీకేనా? జెండాలు మోసిన వారికి ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తుండడం కనిపిస్తోంది.
కుడా పూర్తి స్థాయి అమలులో జాప్యం పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆలస్యం చేస్తోంది. ఉదాహారణకు కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ వృద్ధి, షాపింగ్ మాల్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ అభివృద్ధి క్రమబద్ధీకరణకు సరైన పట్టణ ప్రణాళిక లోపిస్తోంది. కుడా లాంటి సంస్థలు ఈ అభివృద్ధిని నియంత్రించడానికి, అక్రమ నిర్మాణాలను నిరోధించడానికి, పట్టణ మౌళిక సదుపాయాలను మెరుగు పర్చడానికి అవసరం. చెరువుల కబ్జాపై ఇటీవల కాలంలోనే బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఫిర్యాదు చేయడం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వంటి సంఘటనలు కుడా ఏర్పాటు ఆవశ్యకతను తేల్చి చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ అభివృద్ధిని క్రమబద్ధీకరించడానికి అవకాశం లభించింది. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఊసులో లేకపోవడంతో జిల్లాలోని పట్టణాల అభివృద్ధి ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. పాలకవర్గంలో పదవులు స్థానిక నాయకులకు రాజకీయ ప్రాముఖ్యతను, ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసే అవకాశాన్ని అందిస్తాయి. పాలకవర్గ నియామకంలో జాప్యం మూలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో అసంతృప్తిని పెంచుతోంది. స్థానిక నాయకులు, తమ విధేయతకు గుర్తింపుగా పదవులు ఆశిస్తుంటారు.