కమ్మర్పల్లి, ఆగస్టు 13 : కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్, అమీర్‌నగర్‌లో సుమారు రూ.30 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అంతా ఒక కుటుంబమని.. ఆ కుటుంబానికి సీఎం కేసీఆర్ తండ్రి లాంటి వారని అన్నారు. ఇంటికి ఏం కావాలో ఇంటి పెద్దకు మాత్రమే తెలుసని, తెలంగాణకు ఏం కావాలో కేసీఆర్‌కు మాత్రమే తెలుసని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశం ముందు తలెత్తుకునేలా నిలబెట్టారని కొనియాడారు. సంక్రాంతికి గంగిరెద్దుల వేషం వేసుకొని వచ్చినట్లు.. ఎలక్షన్లు రాగానే కొందరు ఊర్ల మీద పడతారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రైతును అరిగోస పెట్టిన చేతిగుర్తోడు రైతు ధర్నా చేస్తున్నడు.. ధరలు పెంచి పేదల కడుపు కొడుతున్న పువ్వు గుర్తోడు పేదల పేరిట ధర్నా చేస్తున్నాడని.. ఇది హత్య చేసినోడే సానుభూతి తెలిపినట్లు విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ రైతులకు మూడు గంటల కరెంటు చాలంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ మోటర్లకు మీటర్లు పెడతామంటున్నదని గుర్తు చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. ఐదేండ్లు కావస్తున్నా బోర్డు తేలేకపోయిన అర్వింద్ చివరకు బోడి గుండు చూపెట్టాడని దుయ్యబట్టారు. అర్వింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితను ఓడగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడి రైతుల కోరిక మేరకు రాళ్ల వాగు మీద రెండు చెక్‌డ్యాములు, డబుల్ లేన్ రోడ్లకు శంకుస్థాపన చేసుకున్నామని గుర్తుచేశారు. అయినా గురడి కాపు రైతన్నలు కొంత అసంతృప్తిగా ఉన్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ తన దృష్టికి తెచ్చాడని తెలిపారు. ‘కానీ నా కాపు రైతన్నలారా.. నియ్యత్‌గా ఒకసారి ఆలోచన చేయాలి’ అని కోరారు.
అంతకుముందు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అమీర్‌నగర్ వద్ద బిల్యానాయక్ తండా నుంచి అప్రోచ్ రోడ్డు వరకు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ బీటీ రోడ్డుగా మార్చేందుకు రూ.4.50 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. కోనాపూర్‌లో శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. రూ.6.20 కోట్లతో నర్సాపూర్ నుంచి భూషణ్‌రావు పేట్ వయా ఇనాయత్‌నగర్, కోనాపూర్ బీటీ రోడ్‌ను 10.5 కి.మీ. నుంచి 15.3 కి.మీ. వరకు డబుల్ లేన్‌గా మార్చే పనులకు, రూ.3.16 కోట్లతో నర్సాపూర్ నుంచి భౌసన్రావుపేట్ వయా ఇనాయత్‌నగర్, కోనాపూర్ బీటీ రోడ్డును 4.0 కి.మీ. నుంచి 15.3 కి.మీ. వరకు పునరుద్ధరణ పనులకు, రూ.2.50 కోట్లతో కోనాపూర్ నుంచి ఆత్మకూరు రోడ్డును నూతన సింగిల్ లేన్ బీటీ రోడ్డుగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రాళ్ల వాగు (పెద్ద వాగు)పై రెండు చోట్ల రూ.4.10 కోట్లు, మరోచోట రూ.3.97 కోట్లతో నిర్మించనున్న రెండు చెక్‌డ్యామ్‌ల పనులకు, రూ.23 లక్షలతో రాళ్ల వాగు అలుగు స్పెషల్ రిపేర్స్ పనులకు శంకుస్థాపన చేశారు.
కోనాపూర్ నుంచి కొత్త చెరువు తండా వరకు రూ.1.10 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంపస్థాపన చేశారు. కోనాపూర్ గ్రామానికి వచ్చిన మంత్రికి మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ లోలపు గౌతమీసుమన్, జడ్పీటీసీ రాధా రాజాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, సర్పంచ్ దయాదేవయ్య, ఎంపీటీసీ గంగాధర్ నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రకాశ్, అమీర్‌నగర్ సర్పంచ్ పుప్పాల గంగాధర్, ఎంపీటీసీ సుప్రియ, కోనాపూర్ ఉపసర్పంచ్ జలంధర్, విండో చైర్మన్ బడాల రమేశ్, భాస్కర్ యాదవ్, బద్దం చిన్నారెడ్డి, పెరుమాండ్ల రాజాగౌడ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, ఎంపీడీవో సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
కమ్మర్పల్లి, ఆగస్టు 13 : తెలంగాణలో వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలు అన్న కాంగ్రెస్ పార్టీ.. రైతుధర్నాకు పిలుపునివ్వడం విడ్డూరమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ ఎక్స్‌రోడ్డులో కాంగ్రెస్ పార్టీ రైతు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏ పార్టీ రైతులను అరిగోస పెట్టిందో.. ఏ పార్టీ రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నదో అర్థం చేసుకోవాలని.. రైతులకు మూడు గంటలే కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోను చూపుతూ రైతులను కోరారు. ఆర్మూర్ ప్రాంత రైతులు ఎర్రజొన్న బకాయిల కోసం నిరసన చేస్తే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపిన దురాఘతాన్ని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఎర్రజొన్న బకాయిలు ఇచ్చారని, రైతులు ఈ విషయాన్ని మర్చిపోరని అన్నారు.