కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 20వ డివిజన్ కంటేశ్వర్ బ్యాంక్ కాలనీ ఏరియాలో కాలనీ మొత్తం చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డ్ ( Dumping yard) ను తలపిస్తుంది. కాలనీలో ఏ మూల చూసినా చెత్తతో నిండిపోయి రోడ్లన్నీ దుర్గంధంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ ( Muncipal Corporation )చెత్త సేకరణ పూర్తిగా గాడి తప్పింది.
చెత్త సేకరణ, పారిశుద్ధ్యం ( Sanitation ) గురించి అధికారులు మాట్లాడడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన కనిపించడం లేదు. సమయపాలన లేకుండా వచ్చే చెత్త సేకరణ ఆటోలు అందుబాటులో ఉన్న చెత్తను సేకరించి వెళ్లిపోతున్నారు. కాలనీకి చెత్త సేకరించే ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎవరైనా కాలనీవాసులు చెత్త సేకరణ గురించి అడిగితే వాహనాలు రిపేర్ లో ఉన్నాయని సమాధానం చెబుతున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు.
రోడ్ల పైన చెత్త కారణంగా కాలనీలో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది సమయపాలన పాటిస్తూ పారిశుద్ధ పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది ఎక్కడ కూడా ఆదేశాలు పాటిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లల్లో ప్రతిరోజూ ఏదో ఒక డివిజన్లో చెత్త ద్వారా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్యం గురించి కేవలం మాటలే కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.