15 రోజుల్లో 52 మందికి డయాలసిస్
ఆర్మూర్, జనవరి21: మూత్రపిండ వ్యాధి బాధితులకు డయాలసిస్ వైద్యం అందుబాటులోకి రావడంతో రోగులకు దూరభారం, ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చొరవతో ఆర్మూర్ వంద పడకల దవాఖానకు డయాలసిస్ కేంద్రం మంజూరైన విషయం తెలిసిందే. కిడ్నీ బాధితులు డయాలిసిస్ కోసం గతంలో హైదరాబాద్, నిజామాబాద్ వంటి నగరాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసేవారు. ప్రస్తుతం ఆర్మూర్‌లో ఉచితంగా సేవలు అందుతున్నాయి. ఈ నెల 5న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు. 15 రోజుల్లో 52 మంది రోగులకు డయాలసిస్ వైద్యం అందించారు. డయాలసిస్ కేంద్రంలో ప్రత్యేక వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందిస్తున్నారు.
ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో శనివారం వరకు 52 మందికి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందించడంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. డయాలసిస్ కేంద్రం ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.