Nizamabad | కంటేశ్వర్, సెప్టెంబర్ 19 : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కే సంధ్యారాణి, డీ నవీన్ కుమార్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా డ్రగ్స్ విచ్ఛలవిడిగా దొరకడం బాధాకరమన్నారు.
విద్యార్థులు, యువత, ప్రజలు డ్రగ్స్ కల్తీకల్లు మత్తు పానియాలు అలవాటు పడి అవి లేకుంటే మానసికంగా పిచ్చోళ్లు అవుతున్న సందర్భాలు జిల్లాలో ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరపకుండా కల్తీకలను నివారించకుండా విచ్ఛలవిడిగా కల్లు డిపోలను పర్మిషన్ ఇవ్వడం కోట్ల రూపాయలు దండుకుంటూ ప్రజలను నాశనం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.
తాగడానికి తాగునీరు లేకున్నా మద్యం ఏరులై పారుతుందనీ, ప్రజలను మత్తులో ఉంచే విధంగా జిల్లా అధికారులు పాలకులు యథేచ్ఛగా బెల్టు షాపులకు పర్మిషన్ ఇవ్వడం ప్రతీ సంవత్సరం బెల్టు షాపుల సంఖ్య పెరగడం, ప్రజలు మానసికంగా శారీరకంగా ఎదగనీయకుండా జీవచ్ఛవాలుగా చేయడం దుర్మార్గమన్నారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటే అనే చందంగా అధికారుల తీరు ఉందని, పాలకవర్గ నాయకులు జిల్లా అధికారులు కల్తీకల్లు మాఫియా పై మద్యం మాఫియా పై డ్రగ్స్ మాఫియా పై ఎందుకు కఠిన చర్యలు చేపడతలేరని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడనాడాలని డిమాండ్ చేశారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు అమూల్య, కీర్తన, పీడీఎస్యూ జిల్లా నాయకులు సృజన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.