ఎండలు ముదరడంతోనే కామారెడ్డి పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలకు మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నుంచి కూడా నీరు రావడం లేదు. దీంతో ఆయా కాలనీల వాసులు ఉదయం నుంచి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం ముగియడంతో.. రానున్న ఎన్నికల కోసం పలువురు రాజకీయ నాయకులు నీటి ఎద్దడిని తీర్చే పనిని ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటున్నారు. పోటాపోటీగా ట్యాంకర్లను ఏర్పాటుచేసి కాలనీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
-కామారెడ్డి, ఏప్రిల్ 19
జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఎండకాలం ఆరంభం నుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. అశోక్‌నగర్, భవనీనగర్, పీఎంహెచ్ కాలనీ, కొత్త సాయిబాబా గుడి రోడ్డు తదితర కాలనీల్లో నీటి సమస్య తలెత్తింది. మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. వచ్చే కొద్ది పాటి నీళ్లు ప్రజల అవసరాలు తీర్చడం లేదు. దీంతో నీటి కోసం అనేక కష్టాలు పడక తప్పడం లేదు. పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులకు విన్నవించినా.. ఫలితం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే పలువురు అధికారులు, కలెక్టర్ నీటి ఎద్దడిపై సమీక్షలు నిర్వహించారు. అయినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. ఇటీవల వరంగల్ నుంచి ప్రాంతీయ సంచాలకుడు షాహెద్ మసూద్ అలీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడిపై బల్దియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పట్టణంలో నీటిని సరఫరా చేయడానికి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కొత్తగా పది ట్యాంకర్లను ఇటీవల ప్రారంభించారు.
వాటి ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో స్థానిక నాయకులు నీటి సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎన్నికల బరిలో నిలువాలని భావిస్తున్న పలువురు నాయకులు.. తమ కాలనీ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్లను ఏర్పాటుచేస్తున్నారు. వాటి ద్వారా పోటీ పడి మరీ నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీవాసులు తమ ఇండ్ల ఎదుట డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని, నీటిని వినియోగించుకుంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ నీటి సమస్య తలెత్తలేదని పట్టణ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతి రోజూ మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేదని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం మారడంతో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.