డిచ్పల్లి, ఫిబ్రవరి 28 : నిరుపేదల సొంతింటి కల ను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం పనులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ నియోజకవర్గానికి ప్రభుత్వం 1200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది.
కేసీఆర్ కాలనీగా నామకరణం..
డిచ్పల్లి మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారి బీబీపూర్ వద్ద 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి కాలనీకి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. 2019లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేద గిరిజనులకు పంపిణీ చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ కాలనీలో ఈ ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇందల్వాయిలో ప్రారంభానికి సిద్ధం..
ఇందల్వాయి మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మూడు నెలల క్రితమే అప్పటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ ఇండ్లను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ పనులను పూర్తి చేశారు. విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి పనులు పూర్తయ్యాయి. 44వ నంబర్ జాతీయ రహదారి గన్నారం రోడ్డు పక్కనే 58 ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో 48 ఇండ్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి 30, రూరల్ మండలం పాల్దా గ్రామంలో 50, సిరికొండ మండల కేంద్రంలో 50 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన వాటి కోసం ప్రభుత్వం స్థలాలను సేకరిస్తున్నది. ఎన్నో ఏండ్లుగా అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వరంలా మారాయి. క్షేత్రస్థాయిలో నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం ఏ రాష్ట్రంలో కూడా లేదని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేసున్నారు. సొంతింటి కల సాకారం కావడంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించడం మా అదృష్టం..
రూరల్ మండలంలో మొదటి సారిగా మా బీబీపూర్ తండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించడం మా అదృష్టం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరి పుత్రులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లకు దక్కుతుంది. మా తండాలో 50 ఇండ్లు నిర్మించి ఇచ్చారు.
-లక్ష్మీబాయి, లబ్ధిదారు
కేసీఆర్ దయతో కల సాకారం..
సీఎం కేసీఆర్ సార్ దయతోనే మా కుటుంబానికి ఈ రోజు రెండు పడకల ఇల్లు లభించింది. నిరుపేదలమైన మాకు కేసీఆర్ దయతో చిరకాల కోరిక నెరవేరింది. సీఎం సార్ మాలాంటి పేదలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. ఇండ్ల వద్ద సకల సౌకర్యాలు కల్పించారు.
-సాంగీబాయి, లబ్ధిదారు