ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 26 : ఆలూర్ బైపాస్ రోడ్డుపై నిర్లక్ష్యం తగదని, అక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి ఆర్మూర్ మున్సిపల్లో డబ్బులు కూడా లేవా అని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఆలూర్ బైపాస్ రోడ్డుతోపాటు అక్కడ నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాకర్లు, స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిబద్ధతలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై నిర్లక్ష్యం తగదన్నారు. ఆలూర్ బైపాస్ రోడ్డు నిర్మాణం స్థానిక ప్రజల ఏండ్ల కల అని గుర్తుచేశారు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, దుమ్మూధూళితో ఆరోగ్య సమస్యలు, పక్కనే ఉన్న చెరువు నిండితే వచ్చే వరదలతో ఆర్మూర్ పట్టణంలోని వేల కుటుంబాలు నిరాశ్రయులుగా మారేవని తెలిపారు.
ప్రజల ఇబ్బందులను గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆలూర్ బైపాస్ రోడ్డు కోసం ఆందోళనలు చేసినట్లు తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకారంతో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో 50 గ్రామాలకు కనెక్టివిటి కలిగిందన్నారు. ఆలూర్ బైపాస్ రోడ్డులో విద్యుద్దీపాలు లేక స్థానికులతోపాటు వాకర్లు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నందిపేట్ డబుల్ రోడ్డును రూ.13 కోట్లతో నిర్మించామని, రోడ్డు పొడవునా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. నందిపేట్ డబుల్ రోడ్డును జీవన్‌రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.