నిజామాబాద్, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమావేశాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మూడు నెలలు గడిచి పోయినప్పటికీ ఇంత వరకూ దిశ మీటింగ్ ఊసే కరువైంది. ఓ వైపు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ నిర్లీప్తత వెరసి ప్రజలకు నష్టం వాటిల్లుతోంది. ప్రతి త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధి పనులపై స్థానిక లోక్సభ సభ్యుడు అధ్యక్షతన దిశ మీటింగ్లు నిర్వహించడం కనీస బాధ్యత.
నిజామాబాద్లో దిశ మీటింగ్లు ప్రతి సారి వాయిదాలతోనే గడుస్తోంది. నిర్ధిష్ట సమయానికి సమావేశాలు నిర్వహిస్తే పథకాల అమలులో వేగం పుంజుకుంటుంది. నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఏర్పడుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో స్థానిక ఎంపీ మాట్లాడేందుకు ఓ అవకాశం సైతం దక్కుతుంది. నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా ధర్మపురి అర్వింద్ ఉన్నప్పటికీ దిశ మీటింగ్లకు అతీగతీ లేకుండా పోతోంది. పార్లమెంట్ సభ్యుడిగా అర్వింద్ రెండో పర్యాయం గెలిచినప్పటికీ దిశ మీటింగ్లు నిర్వాహణలో అంతగా ఉత్సాహం చూపకపోవడంపై జనాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎంపీ నుంచి స్పందన రాకపోవడం తో ప్రభుత్వ యంత్రాంగం సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది.
ప్రతి మూడు నెలలకోసారి దిశ మీటింగ్…
దిశ మీటింగ్లు సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా దిశ మీటింగ్ జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు లేకుండా పోయా రు. అభివృద్ధి పనుల పరోగతిని క్రమం తప్పకుం డా పర్యవేక్షించడానికి, సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడానికి దిశ మీటింగ్లు సహాయ పడుతుంది. క్రమం తప్పకుండా దిశ మీటింగ్లు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరత్వం, సమర్ధత ఏర్పడుతుంది.
ఈ సమావేశాలు జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక కీలక వేదిగగా పని చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకా లు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలును సమీక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రజలకు కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా అందాల్సిన నిధులు, సేవలు సక్రమంగా చేరేలా చూడటమే ప్రధాన లక్ష్యం.
ఉదాహారణకు విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనితీరును సమీక్షించడం దిశ మీటింగ్ల ద్వారా జరుగుతుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయాన్ని పెంపొందించి, అభివృద్ధి పనుల్లో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను దిశ మీటింగ్లు నిర్ధారిస్తాయి. ఇంతటి గొప్ప అవకాశాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
లోక్సభ సభ్యుడే అధ్యక్షత…
దిశ కమిటీలకు సంబంధిత లోక్సభ ఎంపీలు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. వారి బాధ్యతలు ఇందులో బహుముఖంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించి, నిధుల వినియోగంలో సమర్ధతను ఎంపీలు నిర్ధారిస్తారు. జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనుల్లో అడ్డంకులను తొలగించేందుకు వీలుంటుంది. ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక నాయకులతో కలిసి పని చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేసేందుకు వీలుంటుంది.
రాష్ట్ర అవసరాలను పార్లమెంట్లో ప్రస్తావించి, కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులను రాబట్టడానికి ప్రయత్నించవచ్చు. దిశ మీటింగ్లు సమయానికి నిర్వహించకపోవడం మూలంగా జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం లేదా అసమర్థతను గుర్తించలేకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయి.
ఉదాహారణకు జాతీయ రహదారి 63పై మామిడిపల్లి వద్ద నిర్మిస్తోన్న రైల్వే ఫ్లై ఓవర్ అసంపూర్తి పనుల మూలంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. మాధవనగర్ రైల్వే ఫ్లైఓవర్ సైతం ఏళ్లుగా కొనసాగుతున్నదే. అర్సపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్వోబీ పిల్లర్ల వద్దే దర్శనం ఇస్తోంది. నవోదయ స్కూల్ మంజూరైంది. తాత్కాలిక ఏర్పాట్లలో కొనసాగుతోంది. నవోదయ నిర్వాహణపై ఎంపీ దృష్టి పెట్టిన దాఖలాలే లేవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల అమలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి? అని తెలుసుకునేందుకు స్థానిక బీజేపీ ఎంపీకే శ్రద్ధ లేకపోవడం విడ్డూరంగా మారింది.
ఎంపీ అర్వింద్ సమయం కోరాము…
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) మీటింగ్కు ఏర్పాట్లు చేస్తాము. స్థానిక లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ సమయం కోరాము. ఎంపీ నుంచి వచ్చే స్పందన అనుసరించి దిశ మీటింగ్ నిర్వహిస్తాము.
– సాయాగౌడ్, నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి