కామారెడ్డి, సెప్టెంబర్ 28 : పగ లు, ప్రతీకారాలకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు భవనంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఏడు లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,031 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 28, క్రిమినల్ కేసులు 3003, ప్రీలిటికేషన్ కేసులు 49, మోటర్ వాహన ప్రమాదాల కేసులు 16 ఉన్నాయి.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి సంబంధించి 1975లో నమోదైన సివిల్ కేసు కూడా పరిష్కారం కావడం విశేషం. ఎస్పీ సింధూశర్మ, జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్‌సింగ్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి నాగారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృష్ణవేణి, రాజగోపాల్‌గౌడ్, దామోదర్‌రెడ్డి, సభ్యులు సిద్ధరాములు, వాసుదేవారెడ్డి, శంకర్‌రెడ్డి, మనోజ్ రాథోడ్, నరేందర్‌రెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్ రావు, సీఐ సంతోష్ రామన్ పాల్గొన్నారు.