స్వరాష్ట్రంలో కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. సమైక్య పాలనలో ఉనికి కోల్పోయి చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ కులవృత్తిదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో ఆగమైన కులవృత్తులకు జీవం పోసి అనేక సంక్షేమ పథకాలతో వారికి చేయూతనిచ్చి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలు, గొల్లకురుమలకు గొర్రెల యూనిట్లు, రజక, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయంతోపాటు ఉచిత కరెంటు అందిస్తూ ఆదుకుంటున్నారు. రైతన్నలకు రైతుబీమా, నేతన్నలకు చేనేతబీమా అమలు చేస్తున్నట్లుగానే తాజాగా గౌడన్నలకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనారోగ్యంతో, కల్లుగీసే సమయంలో చెట్టుపై నుంచి కిందపడి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే వారి కుటుంబం వీధిన పడడమే. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి మేలు కోసం గౌడన్న బీమా పథకాన్ని తీసుకువస్తున్నారు. కులవృత్తులకు భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలపై అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
– నిజామాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) తెలంగాణ ఏర్పాటు తర్వాత సబ్బండవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలోని ఆకాంక్షలన్నీ నేడు నెరవేరుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న రజక, నాయీ బ్రాహ్మణ, మత్స్యకారులు, గొల్ల, కురుమ, చేనేత, కల్లుగీత వృత్తిదారులు ఏండ్లుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కులవృత్తిని నమ్ముకున్న వారికి తగిన భద్రత, ప్రోత్సాహం లేక కుదేలయ్యారు. చేసిన పనితో వచ్చిన సొమ్మంతా కుటుంబ పోషణకే సరిపోయేది. ఇలాంటి వాస్తవాలను గమనించిన సీఎం కేసీఆర్ కులవృత్తులకు జవజీవాలు తీసుకువస్తున్నారు.
ఆయా వర్గాలకు చేయూతనిస్తూ భారీ ప్రోత్సాహకాలతో పథకాలను తీసుకువచ్చారు. చేనేత కార్మికులకు బీమా, పింఛన్‌తోపాటు యూనిట్ల స్థాపనలో ప్రోత్సహిస్తున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంతోపాటు ఉచిత కరెంట్ అమలు చేస్తున్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పెంపకం, గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా గౌడన్నలకు బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు తెలంగాణ సర్కారు నిశ్చయించింది. దీంతో కల్లుగీత వృత్తిదారులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
గౌడన్న బీమా త్వరలోనే…
బీమా సౌకర్యం ఒకప్పుడు సంపన్న కుటుంబాలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నెలవారీగా, త్రైమాసికం లేదంటే వార్షిక ప్రీమియం చెల్లించాలంటే సామాన్యులకు కుదిరే పనికాదు. పొట్ట గడవడమే కష్టంగా ఉన్న వారికి బీమా తీసుకోవడం తలకు మించిన భారం. కులవృత్తి చేసుకుంటూ బతుకీడుస్తున్న వారికి బీమా అన్నదే తెలియదు. అనారోగ్యంతోనో లేదంటే కల్లుగీత సమయంలో చెట్టుపై నుంచి కింద పడి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమే. వారిని పట్టించుకునే నాథుడే ఉండడు. ఈ దీనావస్థను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి మేలు కోసం గౌడన్న బీమా పథకాన్ని తీసుకు వస్తున్నారు.
జీవిత బీమా సౌకర్యాన్ని ఉచితంగా అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఇప్పటికే కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నది. వైన్‌షాపుల్లో రిజర్వేషన్లను సైతం తీసుకువచ్చింది. కొత్తగా బీమా సౌకర్యంతో వారికి పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గీత కార్మికులు 1051 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.2016 చొప్పున పింఛన్ పంపిణీ చేస్తున్నారు. నెలకు రూ.21.18లక్షలు చొప్పున వ్యయం జరుగుతున్నది. ఏటా రూ.2.54కోట్లు నిధులను పింఛన్ రూపంలోనే ప్రభుత్వం వెచ్చిస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 708 మంది కల్లుగీత కార్మికులకు పింఛన్ అందుతున్నది. వీరికి ప్రతి నెలా రూ.14.27లక్షల చొప్పున ఏటా రూ.1.71కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది.
చేనేత బీమా ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు బీమా పథకం అమలు చేస్తున్నది. 18 నుంచి 59ఏండ్ల మధ్య వయసు(60ఏండ్లలోపు), జియోట్యాగ్ ఉన్న మగ్గం, మర మగ్గం నేసే కార్మికులు, వారికి అనుబంధంగా ఒక కార్మికుడు చొప్పున ఈ బీమా పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నేతన్నకు చేయూత అనే పేరుతో అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకంలో నమోదైన వివరాల మేరకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. చేనేత బీమా పథకంలో అర్హులకు ఉచితంగా బీమా దక్కుతున్నది. లబ్ధిదారుడి వాటా కింద పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన కార్మికులకు అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందుతుంది.
కుటుంబ పెద్ద మరణిస్తే దిక్కుతోచని స్థితిలో ఉండే చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 47మందికి చేనేత బీమా పథకం వర్తిస్తున్నది. అర్హులైన వీరంతా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. కామారెడ్డి జిల్లాలో మగ్గాలు లేకపోవడంతో ఇక్కడ అర్హులెవ్వరూ లేరు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7, 2022 నుంచి నేతన్నలకు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఒకప్పుడు ఆదరణ కరువైన చేనేత కుటుంబాలకు కేవలం తెలంగాణ ఏర్పడిన అనంతర కాలంలోనే సీఎం కేసీఆర్ చొరవతో వీరికి ప్రాధాన్యత దక్కుతున్నది.
రైతు బీమా.. కర్షక ధీమా..
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అన్నదాతలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. 2018, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా ద్వారా సభ్యులుగా నమోదైన రైతు చనిపోతే కుటుంబానికి రూ.5లక్షల పరిహారం వచ్చేలా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. అర్హులైన రైతు చనిపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు విచారించి 15రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుబీమా పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 9వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గతంలో అన్నదాత కుటుంబంలో పట్టాదారు చనిపోతే పైసా పరిహారం అందేది కాదు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వినూత్న పథకంతో ఆ కుటుంబానికి నేడు ఎంతో మేలు జరుగుతున్నది. రైతుబీమాకు పట్టాదారు పాస్బుక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని అర్హుడిగా తేల్చారు. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) నిబంధనల మేరకు బీమా సౌకర్యం పొందే వ్యక్తుల వయస్సు తప్పకుండా 18- 59ఏండ్లలోపు ఉండాలి. నిర్దిష్ట వయస్సు కలిగిన వారికి గుంట భూమి ఉన్నప్పటికీ లబ్ధి చేకూరేలా పథకాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 4100 మందికి లబ్ధి జరిగింది. కామారెడ్డి జిల్లాలో 4,540 రైతు కుటుంబాలకు రైతుబీమా రూపంలో ఆర్థిక సాయం అందింది.
ఇది మహత్తర కార్యక్రమం
గౌడ కులస్తుల్లో చాలా మంది నేటికీ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామాల్లో వృత్తిదారులకు ఏదైనా జరగరాని ఘటనే జరిగితే ఎక్స్‌గ్రేషియా మంజూరు కావాలంటే కొన్ని ఇబ్బందులున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా గీత కార్మిక కుటుంబాలకు అండగా నిలిచినట్లయ్యింది.
– వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
గౌడన్నకు బీమా.. గొప్ప విషయం
గీతన్నలకు బీమా పథకం వర్తింపజేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. గౌడ సమాజాన్ని సమున్నతమైన స్థితిలో నిలబెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా తీసుకువచ్చిన బీమా పథకం ద్వారా కల్లుగీత కార్మిక కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. రైతుబీమా తరహాలో ఉన్న ఈ పథకం ద్వారా గౌడ కుటుంబాలకు అభయం దొరికినట్లే.
– శ్రీనివాస్ గౌడ్, గౌడ యువజన సంఘం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు