నిజామాబాద్, నవంబర్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం గందరగోళంలో పడిపోయింది. మత్స్యకార కుటుంబాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అక్టోబర్ నెల ముగిసినప్పటికీ కనీసం 10శాతం చేప పిల్లలు కూడా సరఫరా కాలేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఎన్నికల ముందు మత్స్యకారులను ఆదుకుంటామని, నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో మాట దాటవేస్తోంది. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి కుప్పి గంతులు వేస్తోంది.
ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందడంతో మత్స్యకారులకు ఉపాధి గండమై పోయింది. నాణ్యత లేకపోవడంతో గత సంవత్సరంలోనూ అరకొరగానే చేప పిల్లలను వదిలారు. 2025-26 ఏడాది కూడా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. నవంబర్ నెలలో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాన్సువాడ కల్కి చెరువులో ఈ సీజన్లో తొలిసారిగా చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో వదిలారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏజెన్సీల అలసత్వంతో పంపిణీ ఆలస్యమైంది. ఇది చేపల పెరుగుదలపై ప్రభావం చూపనుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 398 మత్స్యకారుల సహకార సంఘాలున్నాయి. ఇందులో 24,173 మంది సభ్యులు ఉన్నారు. వీరి జీవనోపాధి కోసం 966 చెరువులు, 1 రిజర్వాయర్‌లో మొత్తం 4.58కోట్లు చేప పిల్లలను వదలాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 724 చెరువుల్లో 1.37కోటి చేప పిల్లలను వదలడం ద్వారా 13,500 మంది మత్స్యకారులకు లబ్ది చేకూర్చాల్సిన అవసరం ఉంది.
చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. తద్వార మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించింది. 100 శాతం రాయితీతో చేప పిల్లల విత్తనాన్ని అందించడం ద్వారా వారికి కొండంత భరోసాతో పాటుగా మత్స్యకారుల కుటుంబాలకు వెన్నుదన్నుగా కేసీఆర్ నిలిచారు. 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ అద్భుత పథకం అటకెక్కింది. తూతూ మంత్రంగానే చెరువుల్లో చేప పిల్లలను వదిలే ప్రక్రియ సాగింది.
డిమాండ్‌కు తగ్గట్లుగా చేప పిల్లలను అందించకపోవడంతో పాటుగా మత్స్యకారుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తోంది. 2025-26 సీజన్ దాదాపుగా ముగిసింది. ఇప్పటికిప్పుడు చేప పిల్లలను వదలడం ద్వారా ఎవరి ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందో? అర్థం కావడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చేప పిల్లల విడుదలపై గడిచిన రెండు నెలలుగా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దల మధ్య బేరసారాలు జరిగి కొలిక్కి రావడం అనేక సందేహాలకు తావిస్తోంది.
సమయానికి చేప పిల్లలు సరఫరా చేయకపోవడంతో మత్స్యకారుల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. నిర్ణీత సమయానికి ఎదిగిన చేపలు చేతికి చిక్కడం కష్టతరమనే భయంతో ఉన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో పాటుగా మత్స్యకారులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లేనట్లుగా స్పష్టంగా అర్థం అవుతోందని మత్స్యకారుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల్లో ఏటా రెండు సైజుల్లో చేప పిల్లలను వదిలి పెడతారు. 45 రోజులున్న 35-40మి.మీటర్లు పొడవున్న వాటిని ఏడాది మొత్తం నీరు నిల్వ ఉన్న జలాశయాల్లో పెంచుతారు. 75రోజులు వయసుంటే 80-100 మి.మీటర్లు పొడవున్న చేప పిల్లలను వదులుతారు. నీటిలో విడుదల చేసిన తర్వాత చేప పిల్లలు ఎదిగి కిలో సైజుకు చేరాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. జూన్, జూలై నెలల్లో వదిలితేనే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు చేపలు పట్టి విక్రయించుకుని మత్స్యకారులు లాభాలు ఆర్జించే వీలుంటుంది. ఆలస్యంగా చేప పిల్లలను చెరువుల్లో వదిలితే వాటి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
నవంబర్ నెల ప్రారంభం అవుతున్న ఈ సమయంలో చేప పిల్లలను వదిలేందుకు అడుగులు వేస్తుండటం విడ్డూరంగా మారింది. మరోవైపు ఆలస్యంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుడుతున్న ఈ సమయంలోనూ శ్రద్ధ కనిపిండచం లేదు. ఇప్పటికే ఆలస్యమైందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కాసుల కక్కుర్తి పడుతోన్న మత్స్యకార శాఖ అధికారులు ముందడుగు పడటానికి అడ్డుపుల్లలు వేస్తుండటం విచిత్రంగా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 విడతలుగా చేప పిల్లల అభివృద్ధి కార్యక్రమం 2023-24 వరకు జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 1018 చెరువుల్లో 4కోట్ల 72లక్షల చేప పిల్లలు, 10లక్షలకు పైగా రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించారు. కామారెడ్డి జిల్లాలోనూ 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల 60వేల చేప పిల్లలను వదిలి మత్య్స అభివృద్ధికి పాటుపడ్డారు. నవంబర్‌లో వదిలిపెట్టే చేప పిల్లలు దాదాపుగా ఏప్రిల్, మే నెలలో మత్స్యకారులకు చేతికి రానుంది.
ఈ సంవత్సరం నవంబర్ గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ చేప పిల్లలను విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. గతంలో నిజాంసాగర్, సింగితం రిజర్వాయర్లతోపాటు మా గ్రామంలోని పాత చెరువులోసైతం చేప పిల్లలను విడుదల చేయడంతో చేపల వేట కొనసాగిస్తూ జీవిస్తున్నం. గతేడాది కూడా తక్కువ సంఖ్యలో చేప పిల్లలను విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తారని తెలిసింది. వంద శాతం చేప పిల్లలను విడుదల చేస్తేనే మాకు తగినంత ఉపాధి లభిస్తుంది.
– గూల రమేశ్, మత్స్యకార్మికుడు, నర్వ గ్రామం, మహ్మద్‌నగర్ మండలం
నవంబర్ నెల గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేయలేదు. దీంతో షికారుకు వెళ్తే చేపలు తగలడం లేదు. దీంతో ఉపాధి భారంగా మారింది. గతంలో మాదిరిగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే చేప పిల్లలను విడుదల చేస్తే కార్మికులందరికీ ఉపాధి దొరుకుతుంది. నిజాంసాగర్‌తో పాటు గ్రామాలోని చెరువుల్లో కూడా ఇప్పటి వరకూ చేప పిల్లలను విడుదల చేయలేదు.
– గూల నర్సింహులు, మత్స్యకార్మికుడు, అచ్చంపేట, నిజాంసాగర్ మండలం