NIZAMABAD COLLECTOR | కంటేశ్వర్, ఏప్రిల్ 02 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల 21వ నెంబర్ రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు.
రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ వివరాలను పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన వెంట ఉన్న అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్క దుకాణంలోనూ సన్న బియ్యం నిల్వలు లేవు అనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు.
జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలలోని 13,10,012 మంది సభ్యులకు ప్రతీ నెల 8248.076 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మంగళవారం నుండి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రాంరంభమైందని, బుధవారం మధ్యాహ్నం నాటికి 3183.095 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తైందని, మొత్తం కోటాలో 38 శాతం పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. కాగా, జాప్యానికి తావు లేకుండా సకాలంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, రేషన్ డీలర్ హిమబిందు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి, నగర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విక్కీ యాదవ్ తదితరులు ఉన్నారు.