ఎల్లారెడ్డి రూరల్, జూలై 9: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి మున్సిపల్ చైర్మన్‌గా పదవిలో కొనసాగుతున్న కుడుముల సత్యనారాయణ పదవికాలం ముగిసే ఐదు నెలల ముందుగానే పదవీచ్యుతుడు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ బాలమణి చేరడంతో బీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. దీంతో బీఆర్ఎస్ తరఫున ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా సత్యనారాయణను ఎన్నుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సత్యనారాయణ పార్టీ మారా రు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. దీంతో మే 18న అధికారులు తీర్మాన సమావేశం నిర్వహించగా, మున్సిపల్ చైర్మన్ హైకోర్టుకు వెళ్లడంతో ఫలితాన్ని ప్రకటించలేదు. రెండు రోజుల క్రితం హైకోర్టు స్టేను కొట్టివేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో మన్నె ప్రభాకర్ మంగళవారం అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని ప్రకటించారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై మెజారిటీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో మన్నె ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 18న ఓటింగ్ నిర్వహించగా 11మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికినట్లు తెలిపారు. నూతన చైర్మన్‌ను ఎన్నుకునే విషయమై ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు ఉన్నారు.