బోధన్ రూరల్ / కామారెడ్డి, నవంబర్ 30 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు శనివారం ధర్నాకు దిగారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దివ్యాంగుల పెన్షన్లను రూ.6 వేలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా పింఛన్లను మాత్రం పెంచకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
పింఛన్లను వెంటనే పెంచాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు యేశాల గంగాధర్, రామ్పటేల్, షేక్ నజీర్, సాయమ్మ, గోపాల్గౌడ్, రాకేశ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచాలని, ఉచిత రవాణా సౌకర్యం, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ, ఉన్నత విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాడి నర్సింహులు, సబ్ కమిటీ చైర్మన్ ఈశ్వర్, వైస్ చైర్మన్ నితీశ్ రెడ్డి, సభ్యులు బంటు స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.