నిజామాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘హస్త’ రేఖలు చెదిరి పోతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త రాగాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ తరహా కార్యక్రమాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పదవుల కోసం కొందరు, అసంతృప్తితో మరికొందరు, నాన్ లోకల్ ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ పాత లీడర్లు ఇలా ఎవరికి వారు నిరసన బాట పడుతున్నారు.
గురువారం ఒకే రోజు జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో విభిన్నమైన రీతిలో నిరసన కార్యక్రమాలు జరగడం దుమారం రేపుతున్నది. గాంధీభవన్ వేదికగా ఎమ్మెల్యేకో హఠావో.. జుక్కల్ బచావో అంటూ కాంగ్రెస్ లీడర్లంతా మూకుమ్మడిగా ధర్నా చేశారు. ఇక, పార్టీ జెండా మోస్తున్న వారిని కాదని, ఇటీవల కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన వారికి మార్కెట్ కమిటీ పదవి కట్టబెట్టడంపై బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ఎల్లారెడ్డిలోనూ మొన్నటికి మొన్న ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సుభాష్‌రెడ్డి వర్గం ఎదురు తిరిగింది. నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పొట్లాటలకు సై అనడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత ఇలాకాలోనే ఆధిపత్య పోరు జరుగుతుండడం అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సొంత ఇలాకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ గాడి తప్పింది. ఎవరికి వారే పంతం నెగ్గించుకునేందుకు పావులు కదుపుతుండడంలో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది. నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు సీనియర్ లీడర్లంతా పదవుల విషయంలో నారాజ్ అయ్యారు. జూనియర్ లీడర్లకు కీలకమైన పదవులు కట్టబెట్టి తమకు పదవులే ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడుగు గంగాధర్‌ను రైతు కమిషన్‌లో సభ్యుడిగా నియమించిన సమయంలోనూ హస్తంలో అలజడి చోటు చేసుకున్నది. ప్రాధాన్యత లేని పోస్టు అప్పగించడంపై ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు.
పదవి వరించినప్పటికీ సంబురాలకు దూరంగా ఉంటూ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకడుగు వేశారు. అధిష్టానం ఆదేశాలతో తిరిగి అదే పదవిలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రంథాలయ సంస్థ పదవులు, మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో చోటు కోసం శ్రమించిన నాయకులు సైతం ఇదే స్థాయిలో పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. కీలక నేతలు వచ్చినప్పుడు ఇలా కనిపించి అలా మాయమవుతున్నారు. అధికారంలో లేనప్పుడు అన్నీ తామై వ్యవహరించి, సొంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ గుర్తింపు లేదంటూ కొందరు సీనియర్లు అనుచరులతో వాపోతున్నారు. పదవుల భర్తీలో సామాజిక న్యాయం లేకపోవడంతోనూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సైతం అసంతృప్తితో రగిలి పోతున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పాత కాంగ్రెస్ నాయకులంతా కలిసి ధర్నా చేయడం కలకలం రేపుతున్నది. మార్కెట్ కమిటీ పదవికి ఇంటర్వ్యూలు పెట్టినట్లు ప్రచారం చేసుకుని సీఎంతో మెప్పు పొందిన గంటల్లోనే ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం చర్చకు దారి తీసింది. మరోవైపు, అటు బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం రోజుకో రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ప్రతిగా పోచారం వర్గం సైతం తమదైన శైలిలో తిప్పి కొడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు, సుభాష్‌రెడ్డి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సుభాష్‌రెడ్డి వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిత్యం ఎక్కడో ఒకచోట పొట్లాటలకు దిగుతున్నది. సీఎం వర్గం మనిషిగా సుభాష్‌రెడ్డి తనదైన శైలిలో దూసుకు పోతుండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా మదన్మోహన్ తన పంతం నెగ్గించుకునేందుకు పావులు కదుపుతుండడం.. కాంగ్రెస్‌లో కుమ్ములాటలకు దారి తీస్తున్నది.
బాల్కొండలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్‌రెడ్డికి పోటీగా మానాల మోహన్‌రెడ్డి తెర మీదికి వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధపడి అనూహ్యంగా వెనక్కి తగ్గిన ఆయన.. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో శ్రేణులను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆర్మూర్‌లో పాత కాంగ్రెస్ నాయకులంతా పార్టీ ఇన్చార్జి వినయ్‌రెడ్డికి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాత నాయకులను వినయ్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ వర్సెస్ పీసీసీ చీఫ్ వర్గం మధ్య పోటాపోటీ నడుస్తున్నది.