బాల్కొండ, జనవరి 29: అభివృద్ధి పనులు ఆగకుండా త్వరితగతిన పూర్తిచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండలోని క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో, డీఎల్పీవో, నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. నియోజకవర్గంలో సుమారు 95వేల దరఖాస్తులు వచ్చాయని, రేషన్‌కార్డుల కోసం 20వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు.
రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు కోసం మరో నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ధరణి అమలు తీరుపై చర్చించి క్లియర్‌గా ఉన్న టైటిళ్లను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. కలెక్టర్, సీసీఎల్ఏలో పరిష్కారానికి తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉపాధి పనులపై అడిగి తెలుసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
కమ్మర్పల్లి మండలం అమీర్‌నగర్ గ్రా మం డీసీ తండా, బిల్యానాయక్ తండాకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు పోడు భూముల పట్టా పాస్‌పుస్తకాలను సోమవారం ఎమ్మెల్యే వేముల అందజేశారు.