Kotagiri | కోటగిరి, సెప్టెంబర్ 17 : గిరిజనుల ఆరాధ దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కోటగిరి మండలం సుద్దులం తాండాలో గిరిజనుల ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్ల రవికుమార్ మోరే కిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించి మూడేళ్లు పూర్తి కావచ్చిన ఇంతవరకు ఊసే లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలలతో మభ్యపెట్టి గదినెక్కి మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం హామీలకు పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై గిరిజనులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 6శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతం చేశారని, బంజారా భవన్ కట్టించారని, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, విదేశీ విద్యకు సహాయం చేశారని, గురుకులాలు పెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ పనులు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో చావు దెబ్బ తినక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కప్ప సంతోష్, అజ్మీర కిషన్ నాయక్, భగవాన్ నాయక్, ఉప సర్పంచ్ శంకర్, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.