లక్నో: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. గుండెపోటుతో అతడు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అంత్యక్రియల తర్వాత మొబైల్ ఫోన్లోని చాట్ ద్వారా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Woman, Boyfriend Kill Husband) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. లోహియా నగర్లో నివసించే 30 ఏళ్ల తాలిబ్, బ్యూటీషియన్‌గా పనిచేసే 27 ఏళ్ల ఇల్మాకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమార్తె ఉన్నది.
కాగా, సెప్టెంబర్ 28న పని ముగించుకుని ఇంటికి వచ్చిన తాలిబ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని తన అన్న అక్రమ్‌కు ఇల్మా తెలిపింది. మంచంపై పడుకున్న భర్త కాసేపటికే మరణించాడని ఆమె చెప్పింది. తాలిబ్ గుండెపోటుతో చనిపోయినట్లుగా ఇల్మా నమ్మించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే, తాలిబ్ మరణంపై అతడి కుటుంబ సభ్యులకు ఆ తర్వాత అనుమానం కలిగింది. అక్టోబర్ 1న తాలిబ్ బంధువు రైస్, ఇల్మా ఇంటికి చేరుకున్నాడు. తాలిబ్ మొబైల్ ఫోన్‌ను ఆమె దాచినప్పటికీ, అతడి దుస్తుల కింద ఉన్న దానిని రైస్ కనుగొన్నాడు. ఆ ఫోన్లో తాలిబ్, ఇల్మా ప్రియుడైన అమన్ మధ్య జరిగిన సంభాషణ బయటపడింది. తన భార్యతో మాట్లాడవద్దని అమన్‌ను తాలిబ్ హెచ్చరించినట్లు అందులో ఉన్నది.
మరోవైపు కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో భర్తను హత్య చేసినట్లు ఇల్మా అంగీకరించింది. తాలిబ్ తనను కొట్టేవాడని ఆమె ఆరోపించింది. సెప్టెంబర్ 28న తాలిబ్ కొట్టిన తర్వాత ప్రియుడైన అమన్‌కు ఇల్మా ఫోన్ చేసింది. దీంతో అమన్ తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి తాలిబ్‌ను కొట్టారు. ఆ తర్వాత అమన్ ఒక చున్నీతో తాలిబ్ గొంతు నులిమి హత్య చేశాడు. ఇల్మాను పెళ్లి చేసుకుంటానని అమన్ ఈ సందర్భంగా ఆమెకు మాట ఇచ్చాడు.
కాగా, తాలిబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి మృతదేహాన్ని వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి కోరారు. అక్టోబర్ 6న తాలిబ్ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.