నిజామాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందూరు సిగలో మరో మణిహారం చేరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో కళాభారతి ఆడిటోరియం నిర్మించనున్నది. కళాభారతి డిజైన్‌ను ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విభిన్న రకాల నమూనాలను రూపొందించగా తుది డిజైన్‌కు సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు. భారీ నిర్మాణ శైలిలో కళాభారతి అత్యద్భుతంగా కనిపించేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రూ.50కోట్ల నిధులను వెచ్చించనున్నారు. కళాభారతి నిర్మాణ పనులకు భూమి పూజకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా మహత్తర కార్యక్రమం కొనసాగనున్నది. ఇప్పటికే కూల్చేసిన పాత కలెక్టరేట్ భవన సమీపంలోనే ఉదయం 11గంటలకు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగానే కళాభారతి రూపుదిద్దుకుంటున్నది. జిల్లా ప్రజల సౌకర్యార్థం సీఎం స్వయంగా ఆలోచించి కళాభారతి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగ్గట్లుగానే స్వల్ప కాలంలోనే మొత్తం ప్రక్రియ చకచకా కొనసాగుతుండడంతో నగరవాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలతో…
కళాభారతి నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆలోచనలతోనే ముందడుగు పడుతోంది. సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మగుట్ట పార్టీ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత కలెక్టరేట్ పక్కనుంచే కాన్వాయ్ వెళ్తుండగా సీఎం పక్కనే ఉన్న జిల్లా ప్రజాప్రతినిధులు పాత కలెక్టరేట్ ఇదేనంటూ వివరించారు. ఈ స్థలంలో భారీ ఆడిటోరియం నిర్మించాలంటూ కేసీఆర్ ఆలోచన చేశారు. తదనంతరం నిజామాబాద్ నగర అభివృద్ధిపై కొద్ది రోజుల క్రితం జరిగిన రివ్యూ మీటింగ్‌లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కళాభారతి నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని చెప్పడంతో వెనువెంటనే యంత్రాంగం పాత కలెక్టరేట్ భవనాలను పూర్తిగా నేలమట్టం చేసి చదును చేసింది. ఇప్పుడీ ప్రాంతంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆడిటోరియం నిర్మాణం కానున్నది. స్వల్ప వ్యవధిలోనే ఆడిటోరియాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం అప్పగించారు. ఇందుకోసం రూ.50కోట్లు వెచ్చించబోతున్నారు.
కుట్రలు పటా పంచలు
పాత కలెక్టరేట్ ప్రాంతంలో ఏదో జరుగబోతోందంటూ ప్రతిపక్ష పార్టీలు గత నెలలో తీవ్ర రచ్చ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆందోళనకు దిగాయి. ప్రైవేటు వ్యక్తులకు విలువైన భూములను లీజుకు ఇవ్వబోతున్నారంటూ అసత్య ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురి చేశాయి. సీఎం కేసీఆర్ స్వయంగా గత పర్యటనలోనే స్పష్టంగా కళాభారతి నిర్మాణంపై ఆదేశాలిచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం రాద్దాంతం చేశాయి. కళాభారతి నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చివేస్తున్న సందర్భంలోనూ అడ్డుతగిలేందుకు ప్రయత్నించారు. తీరా ఇప్పుడు సీఎం చెప్పినట్లుగానే అద్భుతమైన ఆడిటోరియం ఊహించని రీతిలో నిర్మాణం కాబోతుండడంతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలన్నీ పటాపంచలైనైట్లెంది. ఇందూరు కళాభారతి భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతోపాటు మరిన్ని నగరాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన కళాభారతి ఆడిటోరియం తుది నమూనాను గురువారం సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఇందూరు వైభవాన్ని చాటేలా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతోంది. రూ.50కోట్లతో నిర్మించే ఆడిటోరియం నిర్మాణానికి ఈనెల 28న మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారు. కళాభారతిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
నగరవాసులకు వరం
నిజామాబాద్ నగరవాసుల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ఆదేశాలతో కళాభారతి నిర్మాణం జరుగుతుంది. ఇందుకు పాత కలెక్టరేట్ ప్రాంతాన్ని ఎంపిక చేశాం. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు నెలవుగా ఆడిటోరియం ఉండబోతోంది. భారీ ఎత్తున భవన నిర్మాణం చేపట్టనున్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల మేళవింపుగా కళాభారతి నిర్మాణ శైలి ఉండనున్నది. నిజామాబాద్ వాసులకు ఇదొక వరం లాంటిది.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే