కామారెడ్డి, జూలై 3 : కామారెడ్డి పట్టణంలో అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వికాస్‌నగర్ కాలనీలోని ఏడో వార్డులో అక్రమ వెంచర్లలో చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పర్వతాలు మాట్లాడుతూ.. 7 వ వార్డులో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు నాలుగు ఎకరాల 39 గుంటల్లో రెండు వెంచర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమ్ముతున్నారని చెప్పారు.
పోలీసుల సాయంతో వెంచర్లలో ఏర్పాటు చేసిన రోడ్లను తొలగించినట్లు తెలిపారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ వెంచర్ నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. దీంతో ఆ వెంచర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఎవరైనా అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.