బోధన్/ ఖలీల్‌వాడి/ డిచ్పల్లి, అక్టోబర్ 15: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో చేపట్టిన కళాశాలల బంద్ రెండోరోజూ కొనసాగింది. ఇందులోభాగంగా ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, కో-ఆర్డినేటర్ నరాల సుధాకర్ మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, ఆడిట్సెట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. కళాశాలల నిరవధిక బంద్‌కు గల కారణాలను ఆయనకు వివరించారు. విద్యార్థులకు మూడేండ్ల నుంచి ఉపకార వేతనాలు రావడంలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారి వెంట నిశిత రాజు, సూర్యప్రకాశ్, సుజన్, అరుణ్‌కుమార్, రాజు, శ్రీనివాస్, అతిక్ ఉన్నారు.
బోధన్ పట్టణంలోని పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మంగళవారం బంద్ పాటించాయి. బంద్‌లో భాగంగా ఆయా కళాశాలల కరస్పాండెంట్లు నిర్వహించ తలపెట్టిన ధర్నాను పోలీసులు అనుమతించకపోవడంతో వాయిదా వేశారు. తమ సంఘం పిలుపుమేరకు ఆందోళనలు, నిరసనలు చేపడతామని బోధన్ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల కరెస్పాండెంట్లు తెలిపారు.