నిజామాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పౌరసరఫరాల శాఖలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఉభయ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థలో నెలకొన్న అయోమయం ధాన్యం కొనుగోళ్లపై పెను ప్రభావం చూపుతున్నది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తరచూ అధికారులను బదిలీ చేస్తుండడం, కొత్త అధికారులకు జిల్లాపై పట్టు లభించే సమయంలోనే బదిలీ అవుతుండడంతో ధాన్యం సేకరణలో మందగమనం చోటు చేసుకుంటున్నది. కీలకమైన వడ్ల కొనుగోళ్లలో అధికారుల అనుభవం, సమయస్ఫూర్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కానీ, రేవంత్ సర్కారు ముందుచూపు లేకుండా వ్యవహరిస్తూ, ఇష్టారీతిన ట్రాన్స్ఫర్లు చేస్తుండడం వల్ల ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతల సంక్షేమాన్ని గాలికొదిలేసిన అధికార పార్టీ నేతలు.. ఉమ్మడి జిల్లాలో కల్లాలు దాటని వడ్ల విషయంలో కనీసం స్పందించడం లేదు. కేసీఆర్ హయాంలో పంట కోతల సమయానికే యంత్రాంగాన్ని సిద్ధం చేసేవారు. వచ్చిన పంటను వచ్చినట్లు కొనుగోలు చేసి వెంట వెంటనే తరలించడంతో పాటు వేగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. అప్పట్లో వడ్ల సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు పోటీ పడి తొలి స్థానాల్లో నిలిచేవి. ఒకానొక దశలో ధాన్యం సేకరణలో టాప్ 1లో ఉభయ జిల్లాలు ఉండేవి. కానీ ఇప్పడా పరిస్థితి లేకుండా పోయింది.
కామారెడ్డిలోనూ ఇదే దుస్థితి కొనసాగుతున్నది. పౌరసరఫరాలకు ఆయువు పట్టుగా ఉండే అదనపు కలెక్టర్(రెవెన్యూ) పోస్టు ఆర్నెళ్లుగా ఇన్చార్జి అధికారి చేతుల్లోనే ఉంది. హెచ్ఎండీఏలో పని చేస్తున్న విక్టర్‌ను వారం క్రితం అదనపు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఆయనకు రెవెన్యూ శాఖలో అంతగా పట్టు లేదని, ధాన్యం కొనుగోళ్లపైనా అనుభవం లేదని ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి తోడుగా రెండు నెలల క్రితమే కామారెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారిగా, పౌరసరఫరాల సంస్థ డీఎంగా వచ్చిన అధికారులతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కామారెడ్డి పౌరసరఫరాల సంస్థ డీఎం రాజేందర్ ప్రమోషన్ లిస్టులో ఉండడంతో, ఆయన ఎక్కువ కాలం ఇక్కడ పని చేసే అవకాశాలు లేవని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ కేటాయింపుల్లో భాగంగా ష్యూరిటీ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నది. రైస్ మిల్లర్లతో మాట్లాడి వారితో ఒప్పందాలు చేయించడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితిలో కామారెడ్డిలో కొత్త అధికారుల పరిపాలన మీదుగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏ విధంగా ముందుకు పడుతుందనేది అయోమయంగా మారింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కీలక స్థానాలకు వచ్చిన అధికారులకు జిల్లా భౌగోళిక పరిస్థితులు, సారూప్యతలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడాలంటే నెల రోజులైనా పడుతుంది. ఆలోపు కొనుగోళ్ల ప్రక్రియ జోరందుకునే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి ధాన్యం సేకరణ ప్రక్రియలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రైతాంగం పెదవి విరుస్తున్నది.
నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థకు సంబంధించి పది నెలల కాలంలో నలుగురు మేనేజర్లు
మారారు. ఎడాపెడా స్థాన చలనం చేస్తుండడంతో అధికారులకు జిల్లాపై పట్టు రావడం లేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి పౌరసరఫరాల శాఖ అధికారిగా చంద్రప్రకాశ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా జగదీశ్ ఉన్నారు. ఆ ఇద్దరిని సస్పెన్షన్ చేసిన ప్రభుత్వం డీఎంగా రాజేందర్‌ను నియమించింది. కానీ, నెల రోజుల్లోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో.. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ హోదాలో ఉన్న రమేశ్‌బాబుకు పౌరసరఫరాల సంస్థ డీఎంగా నియమించారు.
మూడు నెలల కాలంలోనే ఆయనను సైతం పక్కకు జరిపారు. రమేశ్‌బాబు స్థానంలో మరో ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించారు. గతంలో బోధన్ ఆర్డీవోగా పని చేసిన అంబదాస్ రాజేశ్వర్‌ను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఏడాది కాలంలోనే నలుగురు మారడంతో అంతా గందరగోళం నెలకొంది. ఎవరు వచ్చారో? ఎవరు వెళ్లారో తెలియని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే వానకాలానికి పంట కోతలు జోరందుకున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల పక్కనే పేరుకుపోయింది. కొనుగోలు కేంద్రాలను సర్కారు తెరుస్తున్నప్పటికీ కాంటా మాత్రం వేయడం లేదు. ఈ సమయంలో అధికారుల మార్పు అన్నది కొనుగోళ్లకు ఆటంకంగా మారుతున్నది.