వినాయక్‌నగర్, మార్చి 28: నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డు పక్కన శుక్రవారం సాయంత్రం ఓ బాలుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. బాలుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమెన్స్ కాలేజ్ సమీపంలో రోడ్డు పక్కన బాలుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నగర సీఐ శ్రీనివాస్‌రాజ్, ఎస్సై హరిబాబు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సుమారు 2 సంవత్సరాల వయస్సు గల బాబు తలపై గాయాలు ఉండడంతో ఎవరైనా కొట్టిచంపినట్లు అనుమానించారు.
అయితే, బాలుడు ఎవరనేది విచారించగా, మహారాష్ట్రకు చెందిన వారిగా తేలింది. పర్బాణికి చెందిన కమలాబాయి తన ముగ్గురు పిల్లలతో పాటు బంధువులు ఇద్దరితో కలిసి భిక్షాటన కోసం గురువారం ఉదయం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే, శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తమ బాలుడు కనిపించడం లేదని కమలాబాయి ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు, కంఠేశ్వర్ సమీపంలో బాలుడు విగతజీవిగా కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన కమలబాయి కుమారుడిగా గుర్తించి, మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.