Damara pond shutter theft | కోటగిరి, ఆగస్టు 2 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని దామర చెరువు తూము శుక్రవారం అర్థ రాత్రి ధ్వంసం చేసి షట్టర్ ను గుర్తు తెలియని దుండుగులు చోరీ చేసినట్లు స్థానికులు, రైతులు తెలిపారు. శనివారం ఉదయం చెరువు వైపు పొలాల కు వెళ్లిన రైతులు వృథా పోతున్న నీటిని గమనించారు.
సంబంధిత శాఖ ఆధికారులకు రైతులు సమాచారమందించారు. ఇరిగేషన్ సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని చోరికి గురైన తూమును వృథాగా పోతున్న నీటిని పరిశీలించారు. ఈ విషయం పై ఏ ఈ ఇరిగేషన్ సత్యనారాయణ కు వివరణ కోరగా దామర చెరువు షట్టర్ చోరీ అయిందని, నీటి ప్రవాహం ఎక్కువ ఉందని, చెరువు లో నీళ్లు తగ్గాక వృథా నీటిని నిలపడానికి అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం చెరువు లో 4 MCFT నీళ్లు ఉన్నాయని, షట్టర్ లేకపోవడం తో కిందికి 5 క్యూసెక్కుల నీళ్లు వృథా పోతోందని ఆయన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తూము కు షట్టర్ ఏర్పాటు చేసి వృథా పోతున్న నీటిని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.