కంఠేశ్వర్, సెప్టెంబర్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సౌత్‌జోన్ సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
సబ్ జూనియర్ (గర్ల్స్) 20 కి.మీ, ఉమెన్ జూనియర్ 30 కి.మీ, ఉమెన్ ఎలైట్ 40 కి.మీ విభాగాల్లో పోటీలు నిర్వహించగా..కర్ణాటక క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. సైక్లింగ్ పోటీల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం గమనార్హం. క్రీడాకారులు ఉపయోగించిన సైకిళ్ల విలువ రూ. 5 లక్షల నుంచి రూ.8 లక్షలు ఉండడంతో చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.
ముగింపు కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ హాజరై విజేతలకు మెడల్స్‌ను అందజేశారు. నగరంలో సౌత్‌జోన్ స్థాయి క్రీడలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయకాంత్రావు, ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి, సైక్లింగ్ జిల్లాఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ సుబేదార్, టి. సూర్యప్రకాశ్, నర్సింగ్‌రావు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ మాక్స్వెల్ ట్రెవర్, రాష్ట్ర కోశాధికారి వెంకట నర్సయ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ ఆకుల రాములు తదితరులు పాల్గొన్నారు.