మోస్రా (చందూర్)/బాన్సువాడ రూరల్/ ఎడపల్లి/సారంగాపూర్/నవీపేట, అక్టోబర్ 25 : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చందూర్, మోస్రా మండలాలతోపాటు ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ -నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ వెంచర్లో రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ధాన్యాన్ని కుప్పలుగా పేరుస్తూ టార్ఫాలిన్ కవర్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగి తండా, కొత్తపేట, మల్కాపూర్ తండా గ్రామాల శివారులో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశతో ముత్తకుంట సొసైటీ తరపున ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వనిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం కోసం రైతులు నాలుగు రోజుల క్రితం రోడ్లు, కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. మరో రెండురోజుల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలనుకునే క్రమంలో అకాల వర్షం తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని 60 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని లింగి తండాకు చెందిన బొంత సాయిలు అనే రైతు వాపోయాడు. నవీపేట మండలంలోనూ అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. తడిసిన ధాన్యం రంగు మారడంతో మ్యాచర్ రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోనూ రెండురోజులుగా కురుస్తున్న వానలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులకు కురుస్తున్న వర్షం కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. శుక్రవారం కురిసిన వర్షానికి దేశాయిపేట్, బోర్లం, బోర్లం క్యాంపు, జక్కల్దాని తండా, పోచారం, రాంపూర్, ఇబ్రహీంపేట్ గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఎలాంటి షరతులు విధించకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.