బోధన్ రూరల్/ నిజాంసాగర్, ఏప్రిల్ 4: సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న తదితర గ్రామాలతోపాటు మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామంలో శనివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా.. వాతావరణం ఒక్కసారిగా మారి వడగండ్లు కురిశాయి.
సాలూరా మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 50శాతం వరి దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మద్నూర్ మండలంలో సుల్తాన్పేట్లో మామిడికాయలు నేలరాలాయి. ఆరుతడి పంటలు, వరికి నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి, న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.