నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయి. వరుస చోరీలతో జనం బెంబేలెత్తగా.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఏదోఒకచోట వెలుగుచూస్తుండడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాకు పూర్తిస్థాయిలో పోలీసు బాస్ లేకపోవడంతో శాంతిభద్రతలు అదుపుతున్నాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో దుండగులు తాళం వేసిన ఇండ్లతోపాటు దుకాణాలను టార్గెట్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం రెక్కీ నిర్వహించి, రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్నిరోజులుగా మధ్యాహ్న సమయంలోనే దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చేలోపు ఇల్లగుల్ల చేశారని బాధితులు వాపోతున్నారు. కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైనా నేరం లేదా ఘటన జరిగిన వెంటనే సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించి, స్పందించే ఉన్నతాధికారి లేకపోవడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-వినాయక్‌నగర్, డిసెంబర్ 15
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించిన కల్మేశ్వర్ సింగేనవార్ తనదైన ముద్రవేసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. గత సెప్టెంబర్ 19న ఆయన బదిలీ అయ్యారు. దీంతో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మకు నిజామాబాద్ ఇన్చార్జి సీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే కొంత కాలంగా శాశ్వత పోలీస్ బాస్ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది డ్యూటీల విషయంలో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. తమను నిలదీసే బాస్ లేకపోవడంతో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత ఎస్సైలు, సీఐలు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రాత్రి పగలూ అనే తేడాలు లేకుండా దోపిడీ దొంగతనాలతో పాటు చైన్ స్నాచింగ్ ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు జరగడానికి రాత్రి సమయంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ లేకపోవడంతో పాటు సిబ్బంది నిఘా సైతం లేకుండా పోయిందనే విషయం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
దొంగతనం లేదా మరేదైనా నేరం జరిగితే వాటిని ఛేదించడానికి సంబంధిత ఠాణాల పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. కానీ ఇలాంటి కేసులను ఛేదించేందుకు కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ టీమ్‌తో పాటు ఐడీ పార్టీ, ఇతర పార్టీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సీసీఎస్ ప్రత్యేక టీమ్ ప్రధాన లక్ష్యాం కేవలం చోరీలు, లూఠీలు,ఇతర నేరాల కేసులను చేధించడమే. అంతేకాకుండా వీరికి లా ఆండ్ ఆర్డర్ విధులతో పని లేకుండా ప్రత్యేకంగా దొంగతనం కేసులను ట్రేస్ చేయడం కోసమే నియమించారు. ఇందుకోసం సీసీఎస్ టీమ్‌లో దోపిడీ, చోరీ, లూఠీ కేసులను ఛేదించిన అనుభవం ఉన్నవారినే నియమించారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇన్ని చోరీలు, లూఠీ ఘటనలు జరుగుతున్నా, సంబంధిత ప్రత్యేక టీమ్ సిబ్బంది మాత్రం ఏ ఒక్కటి ఛేదించిన దాఖలాలు లేవు. కేసుల్లో పురోగతి లేకపోవడం చూస్తుంటే సీసీఎస్, ఐడీ పార్టీల నిఘా ఏ మేరకు పని చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లాలో లూఠీలు, దోపిడీ , దొంగతనాలు ఇతర నేరాలను అదుపుచేయాలంటే జిల్లాకు పూర్తిస్థాయిలో పోలీస్ కమిషనర్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు కొత్తబాస్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
అక్టోబర్ 14: ఆర్మూర్రాంనగర్ కాలనీలోని పలు ఇండ్లలో దొంగలు దోపిడీకి పాల్పడి రూ.2.70 లక్షల నగదుతో పాటు తొమ్మిది తులాల బంగారు నగలను దోచుకుపోయారు.
నవంబర్ 1: జిల్లాకేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉండే సముద్రాల ఎల్లేశ్వరరావు దీపావళి పండుగకు ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 23 తులాల బంగారు ఆభరణలతో పాటు 8 తులాల వెండి దోచుకువెళ్లారు.
నవంబర్ 3: జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇంటికి దొంగలు కన్నం వేశారు. దత్తాత్రి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
నవంబర్ 5: ఖలీల్వాడిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వరణ్య ఫార్మసీలో చొరబడి రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
నవంబర్ 16: పెర్కిట్‌లో సయ్యద్ మొయినుద్దీన్ ఇంటి తాళం ధ్వంసం చేసి, 12 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులతో పాటు రూ.50వేలు నగదు ఎత్తుకెళ్లారు.
నవంబర్ 11: వినాయక్‌నగర్ 100 ఫీట్స్ రోడ్డులోని దత్తత్రేయ మందిరం వద్ద రాత్రి సమయంలో దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగానే కిటికీ గ్రిల్ తొలగించి బీరువాను ధ్వంసం చేసి 32 తులాల బంగారు నగలతో పాటు కిలో వెండి దోచుకుపోయారు.
నవంబర్ 17: పెర్కిట్‌కు చెందిన తాజుద్దీన్ ఇంటి తాళం ధ్వంసం చేసిన దుండగులు 10 తులాల బం గారు నగలు, రూ. లక్ష నగదును దోచుకుపోయారు.
నవంబర్ 18: జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించగా..అలారం మోగడంతో నిందితుడిని స్థానికులు పట్టుకుని ఐదో టౌన్ పోలీసులకు అప్పగించారు.
నవంబర్ 20: ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మహాలక్ష్మీనగర్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరిన దుండగులు ఐదుతులాల బంగారు నగలతో పాటు 20 తులాల వెండి, 10 వేల నగదు ఎత్తుకెళ్లారు.
నవంబర్ 28: నగర శివారులోని సంజీవ్ రెడ్డి కాలనీలో ఉన్న ఓ ఇంట్లో వారు ఇంటికి తాళం వేసి గుడి కి వెళ్లి వచ్చే సరికి బీరువాను ధ్వంసం చేసి ఆరు తులాల బంగారు నగలు, నగదు దోచుకువెళ్లారు.
డిసెంబర్ 3: మూడోటౌన్ పరిధిలో కిరాణాషాపు నిర్వాహకురాలి వద్దకు సిగరెట్ కొనేందుకు వచ్చిన దుండగుడు, ఆమె మెడలోంచి రెండు తులాల బం గారు పుస్తెల గొలుసు తెంచుకుని పారిపోయాడు.