నిజామాబాద్ క్రైం, జనవరి 29: ప్రపంచంలో ధనవంతులు అంటే డబ్బున్నవారు కాదని, ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే నిజమైన ధనవంతులని నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు అన్నా రు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), అంకం హాస్పిటల్ సంయుక్తం గా ఆదివారం ఉదయం 21 కిలో మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ నాగరాజు హాజరయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానం నుంచి మామిడి పల్లి రైల్వే గేట్(ఆర్మూర్ రోడ్)వరకు, మళ్లీ అక్కడి నుంచి పాలిటెక్నిక్ మైదానం వరకు పోటీలు నిర్వహించగా.. సీపీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిరోజూ నడక, పరుగు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోటీలో 150 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఐఎంఏ బాధ్యులు డాక్టర్ నీలి రాంచందర్, డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ.. పోటీలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, అంతరాయం కలుగకుండా సహకరించిన ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్,సిబ్బందికి, పూల వర్షంతో స్వాగతం పలికిన శ్రీ చంద్ర టెక్నో స్కూల్ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పరుగు పందెంలో గెలుపొందిన వారికి అంకం దవాఖాన సహకారంతో బహుమతులను ప్రదా నం చేశారు. మొదటి బహుమతి మహేశ్‌కు రూ. 10వేలు, రెండో బహుమతి భారత్ రాజ్ కు రూ.7వేలు, తృతీయ బహుమతి ఓంకార్‌కు రూ. 5 వేలు, నాల్గో బహుమతి నరసయ్యకు రూ.3 వేలు, ఐదో బహుమతి రాంబాబుకు రూ.1500 నగదుతోపాటు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ బాధ్యులతోపాటు డాక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ రెడ్డి, శేషగిరిరావు, అంకం గణేశ్, భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.