వినాయక్‌నగర్, ఏప్రిల్ 4: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్నిరోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ చాపకింద నీరులా పాకుతున్నది. పట్టణాల నుంచి గ్రామాల వరకు అమాయకులు బెట్టింగ్ వలలో పడి చిత్తవుతున్నారు. రూ.లక్షల్లో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈజీ మనీ కోసం అలవాటుపడిన యువత ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు యువత బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్ యాప్ ద్వారా వారిని నిండా ముంచుతున్నాయి.
బెట్టింగ్ కాసేవారిలో క్రికెట్‌పై అమితంగా ఆసక్తి ఉన్నవారిని ఎంచుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్‌లో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేయగా..తొమ్మిది మంది పరారయ్యారు. అరెస్టు చేసిన వారి నుంచి 34 ద్విచక్ర వాహనాలు..రూ.56 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు ముఠాల అరెస్టుకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య శుక్రవారం కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ టీం ఇన్చార్జి, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో నిజామాబాద్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నార్త్ సీఐ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, ఐదవ టౌన్ ఎస్సైలు గంగాధర్,లక్ష్మణ్ సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులైన ఆటో నగర్‌కు చెందిన షేక్ ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. సాలూరాకు చెందిన షకీల్, ఆటోనగర్‌కు చెందిన షేక్ నజీబ్, మహారాష్ట్రకు చెందిన సచిన్, జీజీ ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన రమేశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారి నుంచి 5 సెల్ఫోన్లు, రూ.50వేల నగదుతో పాటు బ్యాంక్ పాసు పుస్తకాలు, క్రెడిట్/డెబిట్ కార్డులను సైతం సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు.
జిల్లాకేంద్రంతోపాటు ఆర్మూర్ పట్టణానికి చెందిన బెట్టింగ్ ముఠాలు మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాలకు చెందిన బెట్టిం గ్ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకొని, వారి ద్వారా ఇక్కడ జోరుగా ఆన్లైన్ బెట్టింగ్ కొనసాగిస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ ముఠాల ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ఐపీఎల్ బెట్టింగ్‌లోనే ఇప్పటి వరకు బెట్టింగ్ గ్రూప్స్‌లో 12 వందల మందిని సభ్యులుగా చేర్చుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. బెట్టింగ్ ద్వారా జిల్లాలో సుమారు రూ. 80 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ ముఠాలకు చెందిన సభ్యులను గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఆర్మూర్ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ము ఠా నుంచి గట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్‌ను అరెస్టు చేసి, వారి నుంచి కుదు వ పెట్టుకున్న 34 ద్విచక్ర వాహనాలు,4 మొబైల్ ఫోన్లు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.ఇదే ముఠాకు చెందిన హర్యానా రాష్ర్టానికి చెందిన విపుల్ మంగ్, మహారాష్ట్రకు చెందిన బంటు పలాస్, బబ్లూ ఠాకూర్, వినాయక్ ఠాకూర్, ఆర్మూర్‌కు చెందిన గట్టడి శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పట్టణానికి చెందిన బెట్టింగ్ ముఠా మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాల బెట్టింగ్ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకొని, ఇక్కడ జోరుగా ఆన్లైన్ బెట్టింగ్ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ముఠా సభ్యులు కమీషన్ తీసుకోవడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లో పెట్టడానికి డబ్బులు లేనివారికి ఫైనాన్స్ సదుపాయం సైతం కల్పిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. డబ్బులు అడిగిన వారి నుంచి విలువైన వస్తువులు, వాహనాలను కుదువ పెట్టుకొని, వడ్డీకి డబ్బులు సైతం సమకూరుస్తున్నారని తెలిపారు. బెట్టింగ్ ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేశ్ కృషి చేశారని సీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.