నిజామాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అవినీతి అనేది వ్యవస్థాగత సమస్యగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇటీవలి ఘటనలు అవినీతి కంపును మరింత తీవ్రంగా మార్చుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 17న) కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏసీబీ వలలో చిక్కడం కలకలం రేపుతోంది. ఒక కల్లు దుకాణం యజమాని నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం ఆబ్కారీ శాఖలో జరుగుతోన్న వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది.
కల్లు దుకాణాన్ని తరలించకుండా, తనిఖీలు లేకుండా, కేసులు పెట్టకుండా ఉండేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించుకుని జేబులు నింపుకొంటున్నారని చెప్పేందుకు బిచ్కుంద సీఐ వ్యవహారమే చక్కని ఉదాహారణగా నిలుస్తోంది. కల్లు దుకాణాలు, లైసెన్సులు, షిఫ్టింగ్, తనిఖీలు వంటి అధికారాలతో మామూళ్లు వసూ లు చేస్తున్న వారి లో ఉమ్మడి జిల్లాలో అనేక మంది పాత్రధారులుగా ఉన్నారు. ఏసీబీ వలలో చిక్కి ంది ఒక్కరే అయినప్పటికీ ఇందులో వాటాల పంపకంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇతర అధికారులకు భాగస్వామ్యం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. బిచ్కు దం కేసును లోతుగా విచారిస్తే మరింత మంది అవినీతిపరులు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో మామూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చక్కర్లు కొడుతోంది. వైన్ షాపుల నుంచి నెల వారీగా మామూళ్లు తీసుకుంటున్న ఓ అధికారి తన కింద పని చేసే వ్యక్తులకు మధ్య పంపకాల విషయంలో గొడవ తలెత్తినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కింది స్థాయి సిబ్బంది నేరుగా పై స్థాయి వ్యక్తులను నిలదీసినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో ఈ వ్యవహారంపై చర్చ నడుస్తున్న సమయంలోనే బిచ్కుంద సీఐ అవినీతి సొమ్ముతో పట్టుబడడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
మామూళ్ల విషయంలో నీకింత… నాకింత అనే స్థాయిలో జరుగుతోన్న పంపకాలను ఉన్నతాధికారులే పెంచి పోషిస్తున్నారా? వాటాల్లో వారికి కూడా షేర్ ఉందా? అనే అనుమనాలు బలంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఈ తరహా దందా మొన్నటి వరకు జోరుగా సాగినట్లుగా ప్రచారం జరుగుతోంది. కొత్తగా లైసెన్సులు పొందిన వైన్ షాపుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. పోగైన సొమ్మును అంతా కలిసి పంచుకున్నారని సమాచారం. వైన్ షాపుల్లో వెలుగు చూసిన చిన్నపాటి తప్పులను పట్టుకుని వేధింపులకు పాల్పడుతుండటం నిత్యం ఎక్సైజ్ శాఖలో జరుగుతున్నదే. అడిగినంత ఇచ్చుకుంటే ఓ విధంగా… లేకపోతే మరో విధంగా అన్నట్లుగా పరిస్థితి చేరింది.
ఎక్సైజ్ శాఖ అధికారులంతా దోపిడీకి ఎగబడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సుద్దులు గాలి మూటలవుతున్నాయి. నిషేధిక మత్తు పదార్థాల వినియోగం, వాడకంపై ఉక్కుపాదం మోపాలని సీఎం పలు మార్లు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిపై ఎక్సైజ్ శాఖ కన్నెత్తి చూడడం లేదు. మరోవైపు గంజాయి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. నగరం, పట్టణం, గ్రామాలు తేడా లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. పోలీసుల దాడుల్లో విచ్చలవిడిగా గంజాయి లభ్యం అవుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మత్తు పదార్థాల నివారణ కోసం కచ్చితమైన లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ పని చేయాల్సి ఉండగా అలాంటిదేమీ ఉమ్మడి జిల్లాలో కానరావడం లేదు. సీఎం ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ అవినీతి, అక్రమాలతో కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా చెలరేగి పోతున్నారు. ఫలితంగా సీఎం ఆదేశాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి.