పెద్దకొడప్గల్, మార్చి 2 : ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించవచ్చని, విద్యార్థులను ఆకర్షించవచ్చని నిరూపిస్తున్నారు కుబ్యానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాలకు 2024 డీఎస్సీ నుంచి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు మారుతి, బాల్‌రాజ్ కలిసి పాఠశాలలో మార్పు తేవాలనే సంకల్పంతో విద్యార్థులకు బోధన చేస్తున్నారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన కుబ్యానాయక్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చక్కని బోధనతో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకే కృషి చేస్తున్నారు.
పాఠశాల గతంలో కళావిహీనంగా ఉండేది. విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపేవారు కాదు. పాఠశాలలో మార్పు తెచ్చేవిధంగా ఉపాధ్యాయులు ఆలోచనలు చేశారు.తండా నుంచి ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కవ మంది విద్యార్థులు వెళ్తున్నారు. చాలా మంది పిల్లలు బడికి రావడం లేదు.
ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా, బడి బయటి పిల్లలు బడికి వచ్చే విధంగా తీసుకురావాలని ఆలోచనతో విద్యార్థుల సామర్యం పరీక్షించిన తరువాత వారు వెనుక బడి ఉన్నారని తెలుసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలో ఎలాగైతే విద్యార్థులు ఉంటారో అదే విధంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాం చేశారు. ప్రైవేట్ విద్యార్థులగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో విద్యార్థులకు యునిఫాం, టై, బెల్టు, షూ, ఐడీ కార్డు అందించి చక్కటి బోధన అందిస్తున్నారు. పాఠశాలలోని గది గోడలపై రంగురంగుల చిత్రా లు వేయించారు. తెలుగు, ఇంగ్లిస్ అక్షరాలు, ఎక్కాలు, తదితర వాటిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గీయించారు. గతంలో ఆదరణ కోల్పోయిన పాఠశాల నేడు అందరినీ ఆకర్షిస్తోంది.
పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. విద్యార్థులు కింద నేలపైనే కూర్చునేవారు. కాని ఇప్పుడు కూర్చోవడానికి కింద మ్యాట్, రైమింగ్ కోసం సౌండ్ బాక్స్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటపాటలు నేర్పిస్తున్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా టూర్ వేళ్లలేదు. పిల్లలందరికీ టూర్ హైదరాబాద్‌లోని జూపార్క్, సచివాలయం, ట్యాక్‌బండ్, బిర్లా మందిర్ తదితర ప్రాంతాలకు విహారయాత్రకు తీసుకెళ్లారు. పాఠశాలలో అన్ని రకాల వసతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంగ్లిష్‌లో బోధన, ప్రైవేట్ పాఠశాలల దీటుగా విద్యాబోధన అందిస్తున్నారు. దీంతో బడి బయటి పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షితులవుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో గతంలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థులుకు సరియైన బోధన లేకా చాలా తక్కువ మంది విద్యార్థులు ఉండేవారు. సరైన విద్య లభించక ప్రైవేట్‌కు పంపేవారు. కాని నూతన ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొని వారికి చక్కగా చదువుతో పాటు హోంవర్క్ చేయిస్త్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. గతంలో 29 మంది విద్యార్థుల సంఖ్య ఉండగా ప్రస్తుతం 48 మందికి చేరింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానం, పాఠశాల వసతులు, పిల్లల చరుకుదనం గమనించిన తండా ప్రజలు ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా తిరిగి ప్రభుత్వ పాఠశాలకు పంపడంతో విద్యార్థులు పెరుగుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ తరహా సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబురపడుతున్నారు. పాఠశాలలోని తరగతి గదుల్లో రంగురంగుల చిత్రాలు, ఆటస్థలం, మౌలిక వసతులు, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, టై, షూ, ఐడీ కార్డులు కల్పిస్తూ క్రమశిక్షణతో పాటు చక్కటి విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు, తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
మేము ఎప్పుడూ కూడా టూర్‌కు వెళ్లలేదు. ఎవరూ తీసుకెళ్ల లేదు. ఇప్పుడు వచ్చిన సార్లు హైదరాబాద్ టూర్ తీసుకుపోయి జూపార్క్, సచివాలయం, ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, మరి ఎన్నో హైదరాబాద్‌లో చూపించారు. చాలా సంతోషంగా ఉన్నది. సార్లు చెప్పిన పాఠాలు చదువుతూ, హోంవర్క్ చేస్తూ ప్రతి రోజు స్కూల్‌కి వెళ్తున్నాం.
– సంగీత, 5వ తరగతి, కుబ్యానాయక్ తండా
విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా పాఠశాలను ఆకర్షించేలా సౌకర్యాలు కల్పించుకుంటూ విద్యా బోధన చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే విద్యా సంవత్సరానికి 60కి పైగా విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తున్నాం. పాఠశాల అభివృద్ధికి తండా ప్రజలు ఎంతో సహకరించారు. వారి మేలు మరిచిపోలేం.
– టి.మారుతి. ప్రధానోపాధాయుడు, కుబ్యానాయక్ తండా