డిచ్పల్లి, నవంబర్ 11: తెలంగాణ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నాయకులు డిమాండ్ చేశారు. టీయూలోని అడ్మిన్ భవనం ఎదుట ఏఐడీఎఫ్బీ, ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్, నాయకుడు రాజశేఖర్ మాట్లాడారు. టీయూలో చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చినా.. దానిని ఇప్పటివరకూ అమలు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఆరోపించారు.
అక్రమంగా నియమితులైన వారికి టీయూ వైస్ చాన్స్‌లర్ కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమవుతున్నదని అన్నారు. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలన్నారు. రికవరీ చేసిన నిధులను తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ధర్నా అనంతరం వీసీ యాదగిరి రావుకు హైకోర్టు తీర్పు కాపీని అందజేయడంతోపాటు దానిని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు భైరాపూర్ రవీందర్, రాహుల్, సుధాకర్, భిక్షపతి పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
టీయూలో 2012లో చేపట్టిన ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ నాయకులు తెలిపారు. ఈ మేరకు వర్సిటీలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అప్పట్లో అక్రమంగా నియమితులైన వారి నుంచి మొత్తం డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. టీయూలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు. ఎన్ఎస్యూఐ టీయూ మాజీ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, పీడీఎస్‌యూ నాయకుడు అనిల్‌కుమార్‌తోపాటు రాజు, గోవింద్, మహేశ్, అరుణ, పవిత్ర, సంధ్య, నవీన్‌కుమార్, దేవేందర్ పాల్గొన్నారు.